రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం
గానగంధర్వుడు, దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) సేవలను స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని చారిత్రక రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని అత్యంత ఘనంగా సోమవారం ఆవిష్కరించారు. ఎస్పీబీ తెలుగు సినీ సంగీతానికి అందించిన అద్భుతమైన సేవలను, ఆయన గాత్ర మాధుర్యాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు. 
 
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఎస్పీ బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్, ఈటివి  సీఈఓ బాపినీడు, సింగర్‌ కల్పన, ఆర్పీ  పట్నాయక్‌ తదితరులు హాజరయ్యారు.
 
7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలలపాటు శ్రమించి విగ్రహాన్ని తారు చేసినట్లు శిల్పి వడయారు తెలిపారు. శిల్పి వడయారుని మంత్రి శ్రీధర్‌ బాబు సత్కరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్నేహశీలి, మృదుస్వభావి అని, ఇవాళ పరిపూర్ణ కళాకారుడిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. 
 
తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారని కొనియాడారు. సినీ చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు.  ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందల మంది గాయకులను పరిచయం చేశారని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. మన పిల్లలకు చదువుతోపాటు సంస్కారం నేర్పాలని సూచించారు.
 
బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు మన తెలుగు ప్రజలందరికీ గౌరవం అని భావిస్తున్నానని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఘంటసాల తరువాత అంతటి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ‘శంకరాభరణం’లో ఆయన పాటిన ‘శంకరా’ పాట తన మనసుకు హత్తుకుందని చెప్పారు. ఈటీవీ కార్యక్రమం ‘పాడుతా తీయగా’ ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను పరిచయం చేశారని ప్రశంసించారు.

బాలు ఓ కులం, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదని తెలిపారు. బాల సుబ్రహ్మణ్యం అభిమానుల కోరిక మేరకు విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించిన మంత్రి 14 భాషల్లో వేలాది పాటలు పాడిన సంగీత ప్రపంచ రారాజు బాలు అంటూ కొనియాడారు.  తన తండ్రి బాల సుబ్రహ్మణ్యం రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ చరణ్‌ తెలిపారు. ఆయనకు అందరూ ఒకటే అని పేర్కొన్నారు.