ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం
* టీ20 సిరీస్‌లో 2-1తో భారత్ ముందంజ
 
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ ముందంజ వేసింది. చండీగఢ్‌ దారుణ ఓటమిని మరిపిస్తూ ధర్మశాలలో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో(25 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది.  టాస్‌ గెలిచిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరో ఆలోచన లేకుండా సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 
ఇదే అదనుగా అర్ష్‌దీప్‌సింగ్‌(2/13), హర్షిత్‌రానా(2/34), వరుణ్‌చక్రవర్తి(2/11), కుల్దీప్‌యాదవ్‌(2/12) ధాటికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఆదిలో అర్ష్‌దీప్‌సింగ్‌, రానా సఫారీల టాపార్డర్‌ పనిపట్టగా, మిగతా పనిని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌తో పాటు కుల్దీప్‌ కానిచ్చేశారు. లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 15.5 ఓవర్లలో 120/3 స్కోరు చేసింది. అభిషేక్‌శర్మ(35), గిల్‌(28), తిలక్‌వర్మ(26 నాటౌట్‌) రాణించగా, కెప్టెన్‌ సూర్యకుమార్‌ మరోమారు విఫలమయ్యాడు.
కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి దక్షిణాఫ్రికాను ఆదిలోనే దెబ్బతీసిన అర్ష్‌దీప్‌సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 పోరు ఈనెల 17న లక్నోలో జరుగనుంది. దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత పేసర్లు అదరగొట్టారు.  గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మన పేసర్లు తమదైన పేస్‌తో నిప్పులు చెరిగారు. పిచ్‌ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ మొదట్లోనే సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టారు.
ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికే ఓపెనర్‌ రెజా హెండ్రిక్స్‌(0)ను అర్ష్‌దీప్‌సింగ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని హెండ్రిక్స్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.  హర్షిత్‌ రానా రెండో ఓవర్‌లో ఈసారి డికాక్‌(1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 1 పరుగుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇదే జోరులో రానా బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న డెవాల్డ్‌ బ్రెవిస్‌(2) మూడో వికెట్‌గా వెనుదిరుగడంతో స్కోరు 7 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది.
అయితే ఓవైపు సహచరులు వరుసగా వెనుదిరుగుతున్నా కెప్టెన్‌ మార్క్మ్‌ సాధికారిక అర్ధసెంచరీతో తన విలువ చాటుకున్నాడు.  టీమ్‌ఇండియా బౌలర్లకు దీటుగా ఎదురొడ్డి నిలుస్తూ వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. స్టబ్స్‌(9), కార్బిన్‌ బాచ్‌(4) ఇలా వచ్చి అలా వెళ్లారు. టాపార్డర్‌ను అర్ష్‌దీప్‌సింగ్‌, రానా పనిపడితే మిడిలార్డర్‌ను హార్దిక్‌పాండ్యా, శివమ్‌దూబే దెబ్బతీశారు. హార్డ్‌హిటింగ్‌తో అదరగొట్టే డొనావన్‌ పెరీరా(20) మార్క్మ్‌ జతగా ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. 

తనదైన శైలిలో ఫోర్‌, సిక్స్‌తో దూకుడు మీద కనిపించిన ఫెరీరాను వరుణ్‌ బోల్తా కొట్టించడంతో సఫారీల ఇన్నింగ్స్‌ కుదేలైంది. యాన్సెన్‌(2), ఎంగ్డీ(2 నాటౌట్‌), బార్ట్‌మన్‌(1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు. తన స్పిన్‌ మాయాజాలంతో వరుణ్‌ సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ దూకుడు కనబరిచారు.

తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌ బాదిన అభిషేక్‌ ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పగా, గిల్‌ ఆదిలోనే ఎల్బీడబ్ల్యూ ఔట్‌ నుంచి బయటపడ్డాడు. యాన్సెన్‌ బౌలింగ్‌లో డీఆర్‌ఎస్‌ ద్వారా లైఫ్‌ దక్కించుకున్న గిల్‌..అభిషేక్‌కు జతకలిశాడు.  వీరిద్దరు సఫారీ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ బౌండరీలు బాదడంతో రెండు ఓవర్లలోనే టీమ్‌ఇండియా స్కోరు 32కు చేరుకుంది. అయితే ఇన్నింగ్స్‌ జోరందుకుంటున్న తరుణంలో బాచ్‌ బౌలింగ్‌లో మార్క్మ్‌ సూపర్‌ క్యాచ్‌తో అభిషేక్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

అభిషేక్‌ ఔటయ్యే సమయానికి టీమ్‌ఇండియా విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. క్రీజులోకి వచ్చిన తిలక్‌వర్మ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.  గత రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్‌ ఈసారి ఆకట్టుకున్నాడు. అయితే యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో కెప్టెన్‌ సూర్యకుమార్‌..తిలక్‌కు జతకలిశాడు. వచ్చి రావడంతో బౌండరీలతో జోరమీద కనిపించిన సూర్యకుమార్‌ మరోమారు చెత్త షాట్‌తో వికెట్‌ ఇచ్చుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..తిలక్‌వర్మ పరిణతి కనబరిచాడు. ఆఖర్లో శివమ్‌ దూబే(10)తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.