భారత రాజకీయ చరిత్రలో అత్యంత విలువలతో కూడిన నాయకుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కొనియాడారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ పట్టణంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ దేశాభివృద్ధికి వాజ్‌పేయీ వేసిన పునాదుల పైనే నేడు ప్రధాని మోదీ ఆధునిక భారతాన్ని నిర్మిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అంతకుముందు మదనపల్లెకు చేరుకున్న పుష్కర్‌సింగ్ ధామీకి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేశ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
సభలో సీఎం ధామీ వాజ్‌పేయీ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. “1996లో వాజ్‌పేయీని అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. ఆ సమయంలో ఆయన పార్లమెంటులో చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. నాకు పదవి, అధికారం ముఖ్యం కాదు. భారతదేశ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అని ఆయన గర్వంగా ప్రకటించారు” అని ధామీ గుర్తుచేశారు.
దేశంలో పేదరిక నిర్మూలనకు వాజ్‌పేయీ అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. వాజ్‌పేయీని స్ఫూర్తిగా తీసుకునే నేటి ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం సమృద్ధ భారత్)ను ముందుకు తీసుకెళ్తున్నారని ధామీ పేర్కొన్నారు. “మోదీ పాలనలో దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. ఒకప్పుడు మనం రక్షణ సామాగ్రిని దిగుమతి చేసుకునే వాళ్లం. కానీ నేడు సాంకేతిక రంగంలో ప్రగతి సాధించి, రక్షణ ఉత్పత్తులను విదేశాలకు అమ్మే స్థాయికి ఎదిగాం” అని తెలిపారు.
దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. మోదీ, వాజ్‌పేయీ ఆలోచనా విధానాలను అమలు చేయడం వల్లే, నేడు అమెరికా, యూరప్ వంటి అగ్రదేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయని ఆయన తెలిపారు. మదనపల్లె ప్రజలతో భావోద్వేగ అనుబంధాన్ని పంచుకుంటూ. ‘నేను దేవభూమి (ఉత్తరాఖండ్) నుంచి జ్ఞానభూమి (మదనపల్లె)కి వచ్చాను. ఇక్కడి ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో సనాతన ధర్మాన్ని కించపరిచే వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అనంతరం పుష్కర్‌సింగ్ ధామి తిరుపతికి చేరుకున్నారు. అక్కడ రేణిగుంట హైవే మర్రిగుంట కూడలిలో వాజ్‌పేయీ కాంస్య విగ్రహావిష్కరించారు.

More Stories
అన్ని పార్టీల అధ్యక్షులకంటే చిన్నవాడు నితిన్ నబిన్
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు
ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం