2026లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర‌ గ్ర‌హ‌ణాలు

2026లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర‌ గ్ర‌హ‌ణాలు
కొత్త సంవ‌త్స‌రంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర‌ గ్ర‌హ‌ణాలు క‌నువిందు చేయ‌బోతున్నాయి.  2026లో సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న (మంగళవారం) సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం వర్తించదు. రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12న (బుధవారం)  ఏర్పడుతుంది. ఇది కూడా భారతదేశంలో కనిపించదు.
 
భారతదేశంలోని ప్రేక్షకులు ఈ రెండు సూర్యగ్రహణాలను కేవలం అంతర్జాతీయ నివేదికలు, లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా మాత్రమే చూడగలరు. 2025 సంవ‌త్స‌రంలో రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. కొత్త సంవ‌త్స‌రంలో మార్చి, ఆగ‌స్టు మాసాల్లో చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌నున్నాయి. వాస్త‌వానికి చంద్రుడు సొంతంగా ప్ర‌కాశించ‌లేడు. సూర్యకిరణాలు చంద్రుడిపై ప‌డిన‌ప్పుడు అవి అక్కడి నుంచి ప్రతిబింబిస్తాయి.

చంద్రుడు-సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్య‌కాంతి చంద్రుడిపై ప‌డ‌దు. సూర్యుడు, భూమి, చంద్రుడు వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్న స‌మ‌యంలో మాత్రమే ఇలా జ‌రుగుతుంది. ఆ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో, చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. 

మ‌నం భూమిపై నుంచి చూసిన స‌మ‌యంలో ఆ భాగం మొత్తం న‌ల్ల‌గా క‌నిపిస్తుంది. దాన్నే మ‌నం చంద్ర‌గ్ర‌హ‌ణంగా పిలుస్తుంటాం. 2026లో తొలి చంద్ర‌గ్ర‌హ‌ణం మార్చి 3న ఏర్ప‌డుతుంది. ఇది పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం. ఈ గ్ర‌హ‌ణం తూర్పు యార‌ప్‌, ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఫ‌సిఫిక్‌, అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌, అంటార్కిటికా ప్రాంతాల్లో క‌నిపింది. 

అలాగే, భార‌త్‌లోనూ ఈ గ్ర‌హణం ద‌ర్శ‌న‌మిస్తుంది. భార‌త కాల‌మానం ప్ర‌కాణం సాయంత్రం 6.26 గంట‌ల‌కు మొద‌లై.. 6.46 గంట‌ల‌కు ముగుస్తుంది. ఈ గ్ర‌హ‌ణం వ్య‌వ‌ధి కేవ‌లం 20 నిమిషాలు మాత్ర‌మే. రెండో చంద్ర‌గ్ర‌హ‌ణం ఆగ‌స్టు 28న ఏర్ప‌డుతుంది. ఈ గ్ర‌హ‌ణం భార‌త్‌లో క‌నిపించేందుకు అవ‌కాశం లేదు. రెండో గ్ర‌హ‌ణం యూర‌ప్‌, వెస్ట్ ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఫ‌సిఫిక్‌, అట్లాంటిక్ ప్రాంతాల్లో క‌నిపిస్తుంది.