బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ అనుమతించదు

బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ అనుమతించదు

తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత భూభాగాన్ని ఉపయోగిస్తున్నారని బంగ్లాదేశ్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి భారత్ ఎప్పుడూ అనుమతించలేదని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలకు భారత్ మద్దతు ఇస్తుందని వెల్లడించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

“2025 డిసెంబర్ 14 నాటి ప్రెస్ నోట్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియకు మద్దతు ఇస్తాం. బంగ్లాదేశ్‌లో శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం” అని తెలిపింది. 

“శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంతో సహా అంతర్గత శాంతి భద్రతలను నిర్ధారించడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం.” అని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. మాజీ ప్రధాని షేక్ హసీనా విదేశాల నుంచి హింసను ప్రేరేపిస్తున్నారని, ఆమె చేసిన ప్రకటనలపై ఢాకా తన బలమైన ఆందోళనలను తెలియజేయడానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్‌ ను పిలిచింది.

అలాగే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే భారత విదేశాంగ కీలక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను ఢాకా కోరింది. బంగ్లా మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. రాబోయే ఎన్నికలను అంతరాయం కలిగించడానికి చేసిన ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేసింది. 

“రాబోయే పార్లమెంటరీ ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతో బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనమని తన మద్దతుదారులను షేక్ హసీనా పిలుపునిస్తోంది. పరారీలో ఉన్న ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి అనుమతించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తన తీవ్రమైన ఆందోళనను భారత ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంది. ఈ క్రమంలో బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు భారత హైకమిషనర్‌ను పిలిపించింది.” అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

బంగ్లాదేశ్ కోర్టులు విధించిన శిక్షలను అనుభవించేందుకు షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌లను బంగ్లాదేశ్ కు భారత్ త్వరగా అప్పగించాలని బాంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కోరింది.  అంతేకాకుండా, బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదిపై ఇటీవల జరిగిన హత్యాయత్నంతో సంబంధం ఉన్న అనుమానితులు తప్పించుకోకుండా ఉండడానికి బంగ్లాదేశ్ భారత్ సహకారాన్ని కోరింది.