కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ లక్ష్యంగా చేసుకుందని, ఆయన గురించిన సమాచారాన్ని ఐఎస్ఐ సేకరిస్తున్నట్లు తాము గుర్తించామని పేర్కొంటూ మధ్యప్రదేశ్ డీజీపీకి కేంద్ర హోంశాఖ ఒక లేఖ పంపింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, భోపాల్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను సమీక్షించి పటిష్టం చేశారు. అటు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం వద్ద కూడా భద్రతను పెంచారు.
ప్రస్తుతం ఉన్న భద్రతాసిబ్బందికి అదనంగా మరి కొంతమందిని మోహరించారు. అయితే ఇప్పటికే జెడ్+ సెక్యూరిటీ ఉండగా.. దానిని మరింత పటిష్టం చేయడం కోసం ఎంతమందిని పెంచారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిరోజూ మొక్కలు నాటాలనే తన సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టానని, పచ్చదనం పెంచేందుకు అందరూ కలిసి రావాలని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా భారత్‌లో జెడ్ ప్లస్ కేటగిరీని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగా పరిగణిస్తారు. ఈ కేటగిరీ కింద 10 మందికి పైగా ఎన్ఎస్జీ కమాండోలతోపాటు, మొత్తం 55 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఒక వ్యక్తి భద్రతా విధుల్లో ఉంటారు. ఈ కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిష్ణాతులు.

More Stories
బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నితిన్ నబిన్
కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం
నూతన సీఐసీగా రాజ్‌కుమార్ గోయల్