కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం

కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం
కేరళలోని మొత్తం 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు, 941 గ్రామ పంచాయతీలకు,152 బ్లాక్ పంచాయతీలకు డిసెంబర్ 9, 11 తేదీల్లో ఎన్నిక లు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మొత్తం స్థానిక సంస్థల్లో చాలా చోట్ల బీజేపీ హవా కనిపిస్తుండగా, సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్ వెనుకబడడం కేరళ రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన పరిణామం. 
 
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ నేతృత్వం లో ని ఎన్‌డిఎ కైవసం చేసుకోవడం కామ్రేడ్ కోటలో కాషాయం జెండా ఎగురవేయడమే. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యం వహిస్తున్న కేరళ రాజకీయ క్షేత్రంలో ఇది చెప్పుకోదగిన మార్పు.  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్వంత జిల్లా తిరువనంతపురంలో రాష్ట్ర రాజధానిలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)తోపాటు కాంగ్రెస్ సారథ్యంలోని నేషనల్‌డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కు గట్టిదెబ్బ తగిలింది.  బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్‌డీఎఫ్ 29వార్డుల్లో గెలుపు సాధించగా, 19వార్డులను యాడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 
 
తిరువనంతపురం కార్పొరేషన్‌లో నిర్ణయాత్మకమైన మెజార్టీ సాధించడానికి బీజేపీకి ఒక స్థానమే తక్కువైంది. ఇంతకు ముందు 2020 లో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకోగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.  గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు ఐదేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కేరళలో కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్‌లో పాగా వేసే వరకు చేరుకోవడం గమనార్హం
 
ఎర్నాకులం జిల్లా త్రిపునిధుర మున్సిపాలిటీలో మొత్తం 53 కౌన్సిల్ స్థానాల్లో 21 స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 20 స్థానాలు మాత్రమే దక్కాయి.  కాగా, వక్ఫ్‌ భూముల వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎర్నాకుళం జిల్లాలోని ‘మునంబం’ వార్డును కూడా బీజేపీ దక్కించుకుంది. 2019 నుంచి ఈ ప్రాంతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి 404 ఎకరాల భూమిని కేరళ వక్ఫ్‌బోర్డు తమ ఆస్తిగా ప్రకటించుకుంది. దీంతో ఇక్కడ నివసిస్తున్న 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
 
ఇక బ్లాక్ పంచాయతీల్లో 4 వార్డులు, గ్రామపంచాయతీల్లో 167బీజేపీ దక్కించుకోగా, త్రిస్సూ ర్ జిల్లాలో ఏ పంచాయతీ బీజేపీకి దక్కలేదు. బీజేపీ నేతృత్వం లోని ఫ్రంట్ 1085 గ్రామ పంచాయతీ వార్డులను, 44 బ్లాక్ పంచాయతీ వార్డులను గెలుచుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.