కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)లో కొత్త ప్రధాన కమిషనర్ గా న్యాయ శాఖ మాజీ కార్యదర్శి, 1990 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని కమిషనర్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వీరిలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా, సామాజిక న్యాయం, సాధికారత మాజీ కార్యదర్శి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, మాజీ ఐఎ్‌ఫఎస్ అధికారి కుశ్వంత్ సింగ్ సేథి, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యురాలైన (లీగల్) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి, రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ కుమార్ జిందాల్ ఉన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసులు చేసిందని అధికారులు శనివారం వెల్లడించారు. సీఐసీగా రాజ్‌కుమార్ గోయల్ చేత రాష్ట్రపతి ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారని తెలిపారు. రాజ్‌కుమార్ గోయల్ అరుణాచల్‌ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెరిటరీస్ (ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ ఏడాది ఆగస్టు 31న న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యాయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు.
గోయల్ కేంద్ర హోంశాఖలో కార్యదర్శి (బోర్డర్ మేనేజ్‌మెంట్)తో పాటు కేంద్రం, జమ్మూకశ్మీర్‌లో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. తాజా నియామకాలతో కేంద్ర సమాచార కమిషన్‌లో చీఫ్‌తో సహా తొమ్మిది ఖాళీలు భర్తీ అయినట్లు లెక్క. ప్రస్తుతం కమిషన్‌లో ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీలు మాత్రమే కమిషనర్లుగా విధులు నిర్వర్తిసున్నారు.
తాజా నియామకాలతో కమిషన్‌లో ఆనంది రామలింగంతో పాటు ముగ్గురు మహిళా కమిషనర్లు (మిగతా ఇద్దరు జయవర్మ సిన్హా, సుధారాణి) ఉండనున్నారు. ప్యానెల్‌లో ఈ సంఖ్యలో మహిళలు ఉండడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కమిషన్‌లో సభ్యుల సంఖ్య పూర్తిస్థాయి బలానికి చేరనుంది.
హీరాలాల్ సమరియాకు 65 ఏళ్లు నిండిన కారణంగా ఆయన ఈ ఏడాది సెప్టెంబరు 13న బాధ్యతల నుంచి వైదొలగడంతో సీఐసీ పదవి ఖాళీ అయింది. అలాగే మిగతా ఎనిమిది పోస్టులు కూడా 2023 నవంబరు నుంచి ఖాళీగానే ఉన్నాయి. కాగా, కేంద్ర సమాచార కమిషన్ నియామకాలపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి కమిషన్‌లో తగిన ప్రాతినిధ్యం లేదంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం జరిగిన ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీ సమావేశంలో అసమ్మతి నోట్ సమర్పించారు. అయితే ఆ తర్వాత రాహుల్ వాదనను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. త్రిసభ్య కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉంటారు.
కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎంపికైన ఎనిమిది మందిలో సుధారాణి రేలంగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ. సుధారాణి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీతో పాటు న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లాలో ఎల్‌ఎల్‌ఎమ్ చేశారు. సివిల్ సర్వీస్‌లో ఇండియన్ లీగల్ సర్వీస్ క్యాడర్‌కు చెందిన సుధారాణికి న్యాయరంగంలో 35 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆమె పీఎన్‌జీఆర్‌బీ సభ్యురాలిగా ఉన్నారు. గతంలో ఆమె సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ, లెజిస్లేటివ్ కౌన్సెల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

More Stories
శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఐఎస్ఐ నుంచి ముప్పు
కామ్రేడ్ల కంచుకోటలో కమల వికాసం
యుపి బిజెపి అధ్యక్షుడుగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి