హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల దావా

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల దావా

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా ఫీజును ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచిన విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ చ‌ర్య‌ను ఖండిస్తూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కోర్టును ఆశ్ర‌యించాయి. కాలిఫోర్నియాతో పాటు 19 రాష్ట్రాలు శుక్ర‌వారం ట్రంప్ ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా ప‌రిహారం కేసు వేశాయి. విదేశీ నైపుణ్య వ‌ర్క‌ర్ల జారీ చేసే హెచ్‌-1బీ వీసా ఫీజును ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచ‌డాన్ని ఆయా రాష్ట్రాలు వ్య‌తిరేకించాయి.తాజాగా బోస్ట‌న్ కోర్టులో కేసు వేశారు. 

సెప్టెంబ‌ర్‌లో ఫీజును పెంచిన విష‌యం తెలిసిందే. హెచ్‌-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఆ ఫీజుకు వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే బోస్ట‌న్ కోర్టులో మూడు కేసులు దాఖ‌ల‌య్యాయి. దేశాధ్య‌క్షుడు రాజ్యాంగాన్ని విస్మ‌రించ‌రాదు అని ఆ రాష్ట్రాలు త‌మ పిటీష‌న్‌లో పేర్కొన్నాయి. ఫెడరల్  చ‌ట్టాల‌ను ఉల్లంఘించి వీసా ఫీజును పెంచిన‌ట్లు కాలిఫోర్నియా అటార్నీ జ‌న‌ర‌ల్ రాబ్ బోంటా వాదించారు. 

ఆదాయం రాబ‌ట్టేందుకు దేశాధ్య‌క్షుడు ఏక‌ప‌క్షంగా ఛార్జీల‌ను పెంచ‌డం అమెరికా రాజ్యాంగానికి వ్య‌తిరేకం పేర్కొన్నారు. ఫీజును పెంచే అధికారం అమెరికా ఉభ‌య‌స‌భ‌ల వ‌ద్ద ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

 ల‌క్ష ఫీజు వ‌సూల్ చేయ‌డం వ‌ల్ల కంపెనీల‌పై ఆర్థిక భారం ప‌డుతుంద‌ని, ఉద్యోగుల‌కు నిత్యావ‌స‌ర స‌ర్వీసులను అందించ‌డం క‌ష్టం అవుతుంద‌ని, విద్యా, ఆరోగ్యం లాంటివి కూడా స‌మ‌స్యాత్మ‌కం అవుతాయ‌ని బోంటా తెలిపారు. కాలిఫోర్నియాతో పాటు న్యూయార్క్‌, మాసాచుసెట్స్‌, ఇలియ‌నాస్‌, న్యూజెర్సీ, వాషింగ్ట‌న్ రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాల‌ను కోర్టులో స‌వాల్ చేశాయి.