* అమర జవాన్లకు నేతల నివాళి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంటుపై ఉగ్రదాడికి నేటితో 24 ఏళ్లు పూర్తి. 2001 డిసెంబర్ 13వ తేదీన ఢిల్లీలోని పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు కిరెన్ రిజుజు, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు, సీనియర్ లీడర్లు జవాన్లకు నివాళులర్పించారు.
2001, డిసెంబర్ 13న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉగ్రమూక పథకం ప్రకారం పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడింది. హోంశాఖ అనుమతి ఉన్న స్టిక్కర్‌తో ఎరుపు రంగు అంబాసిడర్ బుగ్గకారులో లోపలికి ప్రవేశించింది. అక్కడ నిలిపిఉన్న ఉపరాష్ట్రపతి కారును ఢీ కొట్టింది. అనంతరం కిందకు దిగిన ముష్కరులు కాల్పులతో బీభత్సం సృష్టించారు.
అడ్డువచ్చిన వారిని కాల్చుకుంటూ పోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గేట్లన్నీ మూసివేసి ఎదురు కాల్పులకు దిగారు. దాదాపు అరగంటపాటూ కాల్పులు కొనసాగాయి. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు. ఈ దాడికి పాక్‌కు చెందిన లష్కరే, జైషే ఉగ్రసంస్థలే కారణమని దర్యాప్తులో తేలింది.

More Stories
పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్ల తొలగింపు
గాలి నాణ్యతపై సొంతంగానే మార్గదర్శకాలు
5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎస్ఐఆర్ గడువు పొడిగింపు