* తిరుపరన్‌కుండ్రమ్ ఆలయ వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
తమిళనాడులోని తిరుపరన్‌కుండ్రమ్ ఆలయ వివాదంపై స్పందిస్తూ రాష్ట్రంలోని హిందువులు చైతన్యవంతులైతే, ఈ వివాదం విషయంలో ఆశించిన ఫలితం వస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ కీలక స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానంపై తిరుచిరాపల్లిలో నిర్వహించిన సదస్సులో తిరుపరన్‌కుండ్రమ్ ఆలయ వివాదాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలంటూ సభకు హాజరైన వారు ఆయన్ను కోరారు. దీనికి బదులిస్తూ, ఒకవేళ అవసరమైతే తప్పకుండా అలా చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ మార్గంలోనే పరిష్కారాన్ని కోరుకుందామని తెలిపారు. తిరుపరన్‌కుండ్రమ్ ఆలయ వివాదం జాతీయ స్థాయిలో హైలైట్ కావాల్సిన అవసరం ఉంటే, తమిళనాడులోని హిందూ సంఘాలు ఆ విషయాన్ని తమకు తెలియజేస్తాయని పేర్కొన్నారు. దానిపై ఆర్ఎస్ఎస్ చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని మోహన్ భగవత్ తెలిపారు.
ఆ వివాదానికి తమిళనాడులోని హిందువుల బలం ప్రాతిపదికన ఇక్కడే పరిష్కారం లభించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తిరుపరన్‌కుండ్రమ్ ఆలయ వివాదాన్ని పెద్దదిగా చేయాల్సిన అవసరం లేదని, హిందువులకు అనుకూలంగా పరిష్కారం లభించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, ఈ విషయమై మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై విపక్ష ఇండియా కూటమి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై ఇండియా కూటమికి చెందిన 100 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారు. తీర్మానంతో కూడిన లేఖను బుధవారం రోజు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు. తిరుపరన్‌కుండ్రమ్ పట్టణంలోని కొండపై ఉన్న సికందర్ బాదుషా దర్గా సమీపంలో కార్తీక దీపాన్ని ఏర్పాటు చేసేందుకు అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ నిర్వాహకులకు ఆయన అనుమతులు మంజూరు చేశారు.
ఓ వర్గం ప్రజలను సంతోష పెట్టేందుకే ఈ తీర్మానం
“ఓ వర్గం ప్రజలను సంతోష పెట్టేందుకే విపక్ష పార్టీలు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఒక తీర్పును ఇచ్చినందుకు జడ్జిని అభిశంసన చేయడం అనేది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ జరగలేదు. ఓటుబ్యాంకును సంతోషపెట్టేందుకు విపక్ష పార్టీలు ఇలా చేస్తున్నాయి” అని బుధవారం లోక్‌సభ వేదికగా హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు.
ఈ అభిశంసన తీర్మానంపై శివసేన కూడా సంతకం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కొండపై కార్తీక దీపాన్ని వెలిగించే సంప్రదాయానికి అనుకూలంగా తీర్పును ఇచ్చినందుకు జడ్జిని అభిశంసన చేయడం సరికాదని ఆయన హితవు చెప్పారు.

More Stories
గోవా నైట్‌క్లబ్ యజమానులు థాయిలాండ్ లో అరెస్ట్!
ఓటు చోరీపై అమిత్ షా, రాహుల్ గాంధీ వాగ్వివాదం
వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు