2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

డిసెంబర్, వచ్చే ఏడాది జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రకటించింది.  శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం), 29న (వైకుంఠ ఏకాదశి ముందు రోజు), డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు), జనవరి 25 (రథ సప్తమి) కారణంగా ఈ పర్వదినాల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. 

పర్వదినాలకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.  మరోవైపు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌ ద్వారా టీటీడీ ఇప్పటికే టోకెన్లు కేటాయించింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  ఈ-డిప్‌ ద్వారా 1.76లక్షల టోకెన్లను జారీ చేసినట్టు టీటీడీ తెలిపింది. 

వైకుంఠద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది. తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టిటిడి వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. 

ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వైకుంఠ ఏకాదశి రోజున 70 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేయగా గంటకు 4,300 మందికి దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేసింది.  ఈ నెల 30న (వైకుంఠ ఏకాదశి) దర్శన సమయం 20 గంటలు కాగా సామాన్యులకు 15.15 గంటలు, వీఐపీలకు 4.45 గంటలు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.

ఈ నెల 31న (వైకుంఠ ద్వాదశి) 75 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేయగా 19 గంటల దర్శన సమయం కేటాయించింది. ఈ నెల 31న సామాన్యులకు 16.45 గంటలు, వీఐపీలకు 2.15 గంటలు కేటాయించింది. జనవరి 1న 68 వేల మంది భక్తులకు టీటీడీ దర్శన ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాల కోసం 17.30 గంటల సమయం కేటాయించగా సామాన్యులకు 15.15 గంటలు, వీఐపీలకు 2.15 గంటలు కేటాయించినట్లు టీటీడీ వెల్లడించింది.