పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. దీనిని తల్లిదండ్రులు, పిల్లలకు మానసిక ప్రశాంతతను ఇచ్చే కీలకమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
“ఆస్ట్రేలియా వ్యాప్తంగా, 16ఏళ్ల లోపు పిల్లలు ఈ రోజు సోషల్ మీడియా లేకుండా తమ రోజు ప్రారంభిస్తున్నారు. ఇది పెద్ద మార్పు, దీనిని అమలు చేయడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని మొదటి దేశం మనమే. కానీ ఈ నిర్ణయం నిజంగా ఎంతో ముఖ్యమైనది. ఇది పిల్లలు నిజమైన బాల్యాన్ని అనుభవించేందుకు అవకాశం కల్పిస్తుంది” అని ఆంథోని పేర్కొన్నారు.
“అల్గోరిథమ్స్, అంతులేని ఫీడ్స్, గత తరాలకు లేని ఒత్తిడి ఇవన్నీ ఇప్పటి పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో పిల్లలను సురక్షితంగా ఉంచడం కోసం ఈరోజు తీసుకున్న నిర్ణయం ఎంతో అవసరం. బాధ్యత తల్లిదండ్రులపై కాదు, సోషల్ మీడియా కంపెనీలపై ఉండాలి. 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం ద్వారా, పిల్లలకు ఒక నిజమైన బాల్యం, తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతి అందిస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.
పెద్ద టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కుటుంబాలు తమ హక్కులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్న రోజని పేర్కొంటూ పిల్లలు పిల్లలుగానే ఉండే హక్కును, తల్లిదండ్రులకు మరింత భద్రతను అందించే హక్కును తాము బలపరుస్తున్నామని స్పష్టం చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ సహా టిక్‌టాక్, స్నాప్ చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు బాలలు వినియోగించలేరని యూనిసెఫ్ ఆస్ట్రేలియా పేర్కొంది.
16 ఏళ్ల పిల్లలు కొత్తగా ఖాతాలు తెరవడం లేదా ఉన్న వాటిని కొనసాగించలేరని తెలిపింది. “పిల్లలకు ఆయా మాధ్యమాల్లో ఖాతాలు తెరవకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. ఒకవేళ పిల్లలకు ఆయా మాధ్యమాల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే సంస్థలకు సుమారు 50 మిలియన్ డాలర్ల వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది” అని స్పష్టం చేశారు.

More Stories
థాయ్-కంబోడియా సైనిక ఘర్షణలో ఎనిమిది మంది మృతి
గ్లోబల్ సౌత్ లో భారత్, రష్యా, చైనా దేశాలే కీలకం
నేరచరిత్ర లేని 75 వేల మందిని అరెస్ట్ చేసిన అమెరికా