ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర

ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాజ్‌పేయీ స్ఫూర్తిని, ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించనుంది. 

ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక బస్సు యాత్ర ఈ నెల 11న సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ నెల 25న అమరావతిలో జరిగే భారీ సభతో యాత్ర ముగుస్తుందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా దేశానికి వాజ్‌పేయీ చేసిన సేవలను గుర్తు చేయనున్నారని పేర్కొన్నారు.  వాజపేయి శతజయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వాజపేయి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సన్నాహాలు చేస్తున్నారు. ధర్మవరంలో జరిగే కార్యక్రమంలో ‘సంస్కృతి సేవా సంస్థ’ ద్వారా 2,100 మంది పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.

యాత్ర నేపథ్యంలో మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  వాజ్‌పేయీ సేవలను ఆయన ఘనంగా కొనియాడారు. వాజ్‌పేయీ హయాంలో వచ్చిన ‘స్వర్ణ చతుర్భుజి’ హైవే ప్రాజెక్టు దేశ ముఖచిత్రాన్నే మార్చేసిందని గుర్తు చేశారు. ఆయన రాజకీయ భీష్ముడని, అజాత శత్రువు అని కితాబిచ్చారు. సామాన్య కుటుంబంలో పుట్టి, కష్టపడి ఎదిగి దేశానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు.

వాజ్‌పేయీ పాలనలో భారత్ సాధించిన విజయాలను సీఎం గుర్తు చేశారు. 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారత శక్తిని ప్రపంచానికి చాటారని చెప్పారు. కార్గిల్ యుద్ధంతో శత్రుదేశాలకు తిరుగులేని సమాధానం ఇచ్చారని తెలిపారు. టెలీకమ్యూనికేషన్, విమానయాన రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికారని పేర్కొన్నారు.

వాజ్‌పేయీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాజ్‌పేయీ ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదని, ప్రజలకు ఉపయోగపడే పనులకు వెంటనే ఆమోదం తెలిపేవారని చెప్పారు. విధానాల రూపకల్పనలో ఆయన నిర్ణయాలు చాలా వేగంగా ఉండేవని తెలిపారు.

సుపరిపాలన అంటే ఎలా ఉండాలో ఎన్టీఆర్, వాజ్‌పేయీలను చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కూడా పట్టుదల, సేవాభావం కలిగిన విశిష్ట వ్యక్తి అని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా దేశాన్ని 2047 నాటికి నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకు మోదీ ఒక స్ఫూర్తి అని, కూటమి నేతలంతా ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చంద్రబాబు కోరారు.