కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి మూడేండ్ల ముందే అంటే 1980లో సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని మోసం, ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
సోనియా గాంధీతోపాటూ ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సరైన ఆధారాలు లేవని ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ ఇవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది (2026) జనవరి 6కు వాయిదా వేసింది. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అయితే, ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ్వడంతో ఆమె పేరును తొలగించారు. 1983 జనవరిలో తిరిగి చేర్చారు. ఆ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరైంది.
బిజెపి ఎంపి కంగనా రనౌత్ ఈ కేసుపై కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, పార్టీ అవినీతికి ప్రసిద్ధి చెందిందని చెప్పారు. “కాంగ్రెస్ అవినీతికి ప్రసిద్ధి చెందింది. వారిపై స్కామ్‌లు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమె పౌరసత్వం కూడా లేకుండా ఓటు వేసింది” అంటూ ఆమె ధ్వజమెత్తారు.

More Stories
వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు
మానవ హక్కుల పరిరక్షకుల హక్కులకై ఎన్ హెచ్ ఆర్ సి భరోసా!
సిద్దూ భార్య కౌర్ కాంగ్రెస్ నుండి సస్పెండ్