ఇండిగో సంక్షోభం ముగిసిందని ప్రకటించిన సీఈఓ

ఇండిగో సంక్షోభం ముగిసిందని ప్రకటించిన సీఈఓ
 
* 10 శాతం ఇండిగో విమానాలను తగ్గించిన కేంద్రం
 
ఇండిగో సంక్షోభం ముగిసిందని, తమ కార్యకలాపాలు అన్నీ ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయని ఈ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులు అందరికీ ఆయన మరోసారి క్షమాపణలు చెప్పారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కంపెనీ 1800 విమానాలను నడుపుతుందని ఇండిగో తెలిపింది. బుధవారం నుంచి 1900 విమానాలను నడిపేందుకు ప్లాన్‌ చేసింది. ఆన్‌ టైమ్‌ పనితీరు సైతం సాధారణ స్థితికి చేరుకుందని ఇండో పేర్కొంది.
 
“విమాన ప్రయాణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే, అది ప్రజలను, వారి భావోద్వేగాలను, ఆశయాలను, ఆకాంక్షలను గమ్యస్థానాలకు చేర్చుతుంది. మా కస్టమర్లు ఇలా అనేక కారణాలతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ ఫ్లైట్ల రద్దుతో వారు గమ్యస్థానాలకు వెళ్లలేక, రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు మేము చింతిస్తున్నాం. క్షమాపణలు చెబుతున్నాం” అని సీఈఓ తెలిపారు. 
 
“ఇప్పుడు మా మొదటి ప్రాధాన్యత ఏమిటంటే, ఫ్లైట్లు లేక చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే. ఇందుకోసం మా ఇండిగో బృందం మొత్తం కష్టపడుతోంది” అని ఆయన ప్రకటించారు.  ఇండిగో విమానాల రద్దు వల్ల చాలా మంది టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని, వారందరికీ ఇప్పటికే పూర్తిగా రీఫండ్ చేసినట్లు పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 
 
అంతేకాదు వారి బ్యాగేజీని (సామగ్రి) తిరిగి అప్పగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా బ్యాగులు కస్టమర్ల ఇంటికి పంపించామని, మిగిలిన బ్యాగులను అతి త్వరలో డెలివరీ చేయడానికి తమ బృందం కృషి చేస్తోందని ఆయన అన్నారు. మరోవంక, విమానాల రద్దు, ఆలస్యంతో గత వారం రోజులుగా దేశీయ విమానయాన రంగాన్ని అస్తవ్యస్తం చేసి సంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది.
ఇక నుంచి ఇండిగో తన కార్యకలాపాలను 10 శాతం తగ్గించుకోవాలని ఆదేశించింది. తొలుత ఇండిగోకు 5 శాతం సర్వీసులనే తగ్గించాలని భావించినా తర్వాత దానిని 10 శాతానికి పెంచి, రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ను ఇండిగోకు పంపింది. ప్రస్తుతం ఇండిగో రోజుకు దేశీయ, అంతర్జాతీయంగా 2,200 విమానాలను నడుపుతుండగా, కొత్త ఆదేశాలతో 200కు పైగా విమానాలను ఆ సంస్థ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తగ్గించిన స్లాట్లను ఎయిరిండియా, ఆకాశ్‌, స్పైస్‌జెట్‌ లాంటి సంస్థలకు కేటాయిస్తారు.
విమానయాన కార్యకలాపాలను స్థిరీకరించడానికి, రద్దులను తగ్గించడానికి కేంద్రం ఇండిగో విమాన షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించిందని పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తగ్గించిన షెడ్యూల్‌కు కట్టుబడి ఉండగా, ఇండిగో మునుపటిలాగే అన్ని గమ్యస్థానాలను కవర్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను మంత్రిత్వ శాఖకు పిలిపించి తాజా పరిస్థితి గురించి చెప్పమని కోరగా డిసెంబర్ 6 వరకు ప్రభావితమైన విమానాలకు 100 శాతం వాపసు పూర్తయిందని చెప్పారని కేంద్ర మంత్రి తెలిపారు. 

కాగా, ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియమ నిబంధనలు బాగా ఉండి, అవి వ్యవస్థను మెరుగుపరచాలే తప్ప వారిని బాధించేలా ఉండకూడదని ప్రధాని ఈ సమావేశంలో పేర్కొన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు చెప్పారు.