థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో తాజాగా చెలరేగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. గత రెండు రోజుల్లో థాయ్ సైనిక కాల్పుల్లో ఏడుగురు కంబోడియా పౌరులు మరణించారని, 20 మంది గాయపడ్డారని కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు తమ వైపు నుంచి ఓ సైనికుడు మరణించాడని, 18 మంది గాయపడినట్లు థాయ్ సైన్యం ధృవీకరించింది.
తాజా ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
కాగా, ఈ ఏడాది జులైలో థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో సైనికులతోపాటూ పౌరులు కూడా మరణించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ రంగంలోకి దిగారు.
కౌలాలంపుర్‌లో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారు. ట్రంప్ సమక్షంలో థాయ్‌లాండ్-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, ఐదు నెలల్లోనే మళ్లీ అక్కడ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.

More Stories
జుడోలో అస్మితా డేకు స్వర్ణం, జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజతం
పీఓకె పౌరులపై పాక్ “క్రూరమైన బలప్రయోగం”పై భారత్ ఆగ్రహం
హమాస్ నిరాయుధీకరణ, గాజా నుండి ఇజ్రాయిల్ బలగాల ఉపసంహరణ!