గ్లోబల్ సౌత్ లో భారత్, రష్యా, చైనా దేశాలే  కీలకం

గ్లోబల్ సౌత్ లో భారత్, రష్యా, చైనా దేశాలే  కీలకం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనపై చైనా సానుకూలంగా స్పందించింది. భారత్, రష్యా, చైనాలు గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన భాగమని పేర్కొంది. ఈ మూడు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం దోహదపడతాయని వ్యాఖ్యానించింది.

“భారత్, రష్యా, చైనాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇవి గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులు” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువో జియాకున్ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నాతెలిపారు. అంతేకాదు గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ పర్యటనకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషించడంపై మొదటిసారి సానుకూలంగా స్పందించారు.

బీజింగ్తో మాస్కో మధ్య సన్నిహితమైన, బలమైన సంబంధాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని పుతిన్ భారత్ పర్యటనను నిశితంగా పరిశీలించామని గువో జియాకున్ చెప్పారు. అంతేకాదు రష్యా, భారత్లతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.  పుతిన్ భారత్ పర్యటనకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, చైనాలు తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. మేము ఆ బంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తాం’ అని తెలిపారు.

అంతేకాదు ఓ భారతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, చైనా నాయకులు తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ ఇరుదేశాల ద్వైపాక్షిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు రష్యాకు లేదని పేర్కొన్నారు. మరోవైపు భారత్, చైనా మధ్య 2020లో ‘తూర్పు లద్దాఖ్ ఘర్షణ’ జరిగింది. దీనితో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఇటీవలి కాలంలో ఈ ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో భారత్తో స్థిరమైన, బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని గువో జియాకున్ తెలిపారు.

“భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక దృక్పథంతో నిర్వహించడానికి చైనా సిద్ధంగా ఉంది. అలాగే ఇరుదేశాలకు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే స్థిరమైన, బలమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆసియాకు, అంతకు మించి ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం తగిన సహకారం అందించడానికి, భారత్తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది” అని గువో జియాకున్ అన్నారు.