ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం

ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం
 
ఇండిగో అంతర్గత సమస్యలతోనే ప్రస్తుత సంక్షోభం తలెత్తినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ లేవనెత్తిన ప్రశ్నకు రామ్మోహన్‌ నాయుడు సమాధానమిచ్చారు. “ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాం. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. సమస్య పరిష్కారానికి వెంటనే అప్రమత్తం చేశాం. ఇండిగో సంక్షోభానికి దాని సిబ్బంది రోస్టరింగ్‌, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలోని సమస్యలే కారణం” అని తెలిపారు. 

“ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌ (ఎఫ్‌డీటీఎల్‌) నియమాలతో ఎలాంటి సమస్యలూ లేవు. అందరితో చర్చించాకే ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను రూపొందించాం. నెల వరకూ సజావుగానే విమాన సర్వీసులు నడిచాయి. డిసెంబర్‌ 1న జరిగిన సమావేశంలోనూ ఇండిగో ఎలాంటి సమస్యనూ లేవనెత్తలేదు. డిసెంబర్‌ 3 నుంచే సమస్య మొదలైంది” అని చెప్పారు.

 ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారాని పేర్కొంటూ ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.  అదేవిధంగా ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంచకుండా పరిమితి విధించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టికెట్‌ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 

అయితే, ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్‌ నాయుడు చెప్పిన సమాధానంపై విపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ గందరగోళం కారణంగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

కాగా, సంక్షోభం కారణంగా రద్దైన, ఆలస్యమైన విమానాల టికెట్ల రిఫండ్‌కు సంబంధించి ఇప్పటి వరకూ రూ.827 కోట్లను ఇండిగో చెల్లించినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు వారాల్లోనే ఈ మొత్తం రిఫండ్‌ చేసినట్లు తెలిపింది. నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 7 మధ్య రెండు వారాల్లో మొత్తం 9,55,591 టికెట్ల రద్దకు సంబంధించి రూ.827 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.