భారతదేశంలో అత్యంత ఆనందోత్సవాలలో అత్యధిక ప్రజలు జరుపుకొనే దీపావళి పండుగ మరి కొద్దీ రోజలలో యునెస్కో వారసత్వ జాబితాలో చోటు చేసుకోనుంది. అందుకోసం భారత దేశం విశేషంగా కృషి చేస్తున్నది. ఈ నెల 22 నుండి ఢిల్లీలో జరుగనున్న శాశ్వత సాంస్కృతిక వారసత్వం కోసం అంతర్-ప్రభుత్వ కమిటీ (ఐసిహెచ్) సమావేశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
భారత దేశంలో ఈ కమిటీ మొదటిసారిగా సమావేశం అవుతూ ఉండటం గమనార్హం. ఈ సమావేశం అజెండాలో సంపూర్ణ సాంస్కృతిక వారసత్వ మానవాళి జాబితాలో దీపావళి పండుగను చేర్చే అంశం ఉంది. ఈ నామినేషన్ ను సమావేశం పరిశీలించిన తర్వాత, డిసెంబర్ 10న ఆ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే, దుర్గా పూజ, గర్బా, కుంభమేళా, యోగా (2016)లతో సహా భారతదేశం నుండి 15 అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మొదటిసారిగా, భారతదేశం ఈ కమిటీ సమావేశంపై ఆతిధ్యం ఇస్తూ ఉండడంతో, మన దేశం శాశ్వత సాంస్కృతిక వారసత్వం, సమాజ ఆధారిత రక్షణ కార్యక్రమాలను ప్రదర్శించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాము. ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం 17వ శతాబ్దపు మొఘల్ శకం కోట స్థలం ఎర్రకోట ప్రాంగణంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఇప్పటికే వారసత్వ సంపదగా ప్రకటించిన కట్టడాల/అంశాల పరిరక్షణ కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు సమర్పించిన నివేదికల ఆధారంగా చర్చలు జరుగుతాయి.
వాటి పరిరక్షణ కోసం అంతర్జాతీయ మద్దతు కోసం విజ్ఞప్తులను, భవిష్యత్ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా చర్చిస్తారు. వారసత్వ సంపదలను పరిరక్షించడంలో అంతర్జాతీయంగా అమలు పరుస్తున్న ఉత్తమమైన పద్ధతులు, వినూత్న భద్రతా పద్ధతులను కూడా చర్చిస్తారు. కమిటీ సభ్యులు, యునెస్కో అధికారులు, నిపుణులు, గుర్తింపు పొందిన ఎన్జీఓలతో సహా 180కి పైగా దేశాల నుండి 1,000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
సమావేశాన్ని నిర్వహించడం భారతదేశానికి అనేక వ్యూహాత్మక, దౌత్య ప్రయోజనాలను అందిస్తుందని, యునెస్కోతో సహకారాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
“ఈ సమావేశం దేశానికి తన ప్రపంచ ప్రభావాన్ని, సాంస్కృతిక దౌత్యాన్ని, మృదువైన శక్తిని పెంచడం ద్వారా సహాయపడుతుంది, దాని వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తుంది. సాంస్కృతిక సంరక్షణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది మరియు యువతరాన్ని వారి సాంస్కృతిక గుర్తింపుతో అనుసంధానించడానికి ప్రేరేపిస్తుంది” అని మంత్రి వివరించారు.

More Stories
ఛత్తీస్గఢ్లో హింసాత్మకంగా బొగ్గు గనుల ప్రాజెక్ట్ నిరసనలు
హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుపై భారత్ ఆందోళన
మద్యం, పొగాకుతోనే 62 శాతం నోటి కాన్సర్ కేసులు