ఆదివారం రాత్రిలోగా రీఫండ్‌ చేయాలి

ఆదివారం రాత్రిలోగా రీఫండ్‌ చేయాలి
* ఇండిగో సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీసు!
గత ఐదు రోజుల్లో 2వేలకు పైగా విమానాలు రద్దవడంతో ఇండిగో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో  రద్దు చేసిన విమానాలకు సంబంధించిన రీఫండ్‌ ప్రక్రియను ఆదివారం సాయంత్రం వరకు పూర్తి చేయాలని విమానయాన సంస్థను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశించింది. ప్రయాణీకుల లగేజీని రాబోయే రెండు రోజుల్లో డెలివరీ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ చెప్పింది.

రద్దు కారణంగా ప్రయాణం ప్రభావితమైన ప్రయాణీకుల నుంచి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఫీజులను సైతం వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇటీవల వరుసగా విమానాలను ప్రభావితమవుతున్న విషయం తెలిసిందే. దాంతో విమానాల రద్దు నేపథ్యంలో రీఫండ్‌ను ఆటోమేటిక్‌గా తిరిగి ఇవ్వనున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. డిసెంబర్‌ 5, డిసెంబర్‌ మధ్య రద్దు, రీషెడ్యూల్‌ అభ్యర్థనలను తాము పూర్తిగా గౌరవిస్తామని ఇండిగో పేర్కొంది.

మరోవంక, ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని  ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్‌ షోకాజ్ నోటీసు జారీ చేసింది. భారీ స్థాయిలో విమానాల రద్దుకు కారణాలేంటో 24 గంటల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.

ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో తెలిపింది. సీఈవోగా సంస్థ కార్యకలాపాల నిర్వహణలో, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో విఫలమయ్యారని పేర్కొంది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌ నిబంధనల అమల్లో నిర్లక్ష్యమే విమానాల రద్దుకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని డీజీసీఏ తెలిపింది.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో శనివారం 400కుపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు ప్రత్యేకంగా సహాయం, సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఈ సెల్‌ ప్రస్తుత సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యే ప్రయాణీకులను ముందస్తుగా స్పందించి రీఫండ్‌ లేదంటే., ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు చెబుతుందని ప్రభుత్వం ఆదేశించింది. 

కార్యకలాపాలు పూర్తిగా సాధారణ పరిస్థితి చేరే వరకు ఆటోమేటిక్‌ రీఫండ్‌ వ్యవస్థ యాక్టివ్‌గా ఉండాలని, విమాన రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికులు అందుకోలేకపోయిన వారి లగేజీని రాబోయే 48 గంటల్లో తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.  కాగా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానాల రద్దు నేపథ్యంలో 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ శనివారం ప్రకటించింది. ఈ రైళ్లు 104 ట్రిప్‌లు నడుస్తాయి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పాట్నా, హౌరా వంటి ప్రధాన నగరాల్లో ట్రైన్‌ ట్రాఫిక్‌ పరిస్థితిని విశ్లేషించి ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

ట్రాఫిక్‌ పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు, వాటి ట్రిప్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ) దిలీప్‌ కుమార్‌ చెప్పారు. ప్రత్యేక రైళ్ల గురించి సమాచారాన్ని విమానాశ్రయాల్లో ప్రచార ం చేయాలని ఆదేశించామని తెలిపారు.దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వెయ్యికపైగా విమానాలను రద్దు చేసింది. రీఫండ్‌ విషయంలో ఆలస్యం జరిగినా నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రద్దయిన, అంతరాయం కలిగిన అన్ని విమానాలకు రీఫండ్‌ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.