బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల

బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ, ఈ నెల 7న బిజెపి ఆధ్వర్యంలో ‘గల్లంతైన గ్యారంటీలు – నెరవేరని వాగ్దానాలు, ప్రజా వంచనకు రెండు సంవత్సరాలు’ అనే నినాదంతో ఇందిరా పార్క్ వేదికగా మహాదర్నా నిర్వహించబోతున్న సందర్భంగా పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతంరావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్, బిజెపి తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్, సీనియర్ నాయకులు కట్టా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ఇప్పుడు ‘విజయోత్సవాలు’ పేరుతో మళ్లీ ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తుందని వారు ధ్వజమెత్తారు.  ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయలేక ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు’ అని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడం పట్ల మండిపడ్డారు.
ఇప్పుడు మరోసారి కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించడం, ద్వంద్వ వైఖరి, ప్రజలను మోసం చేయాలనుకునే వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ప్రజావంచన పాలనకు ప్రతిఘటనగా మన ప్రశ్నిస్తున్న తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఇదే సందర్భంగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్  రావు  నేతృత్వంలో డిసెంబరు 7న ఇండిరా పార్క్ వద్ద నిర్వహించి బిజెపి మహాధర్నా  ప్రజా ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.