భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు 

భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్​ తటస్థంగా లేదని, శాంతివైపు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన చర్యలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో మోదీ ఈ విషయాన్ని చెప్పారు. కేవలం చర్చలు, దౌత్యం ద్వారా ఈ వివాదం ముగియాలని ఆయన పేర్కొన్నారు. శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 
 
దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని, దౌత్యం ద్వారానే రష్యా, ఉక్రెయిన్‌లు విభేదాలను పరిష్కరించుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. భారత్, రష్యా కలిసి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిద్దామని పుతిన్‌తో సూచించారు.  ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ పేర్కొన్నారు. 
 
ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని తెలిపారు. ఇటీవల కాలంలో గ్లోబల్ నేతలతో తాను ఎప్పుడు మాట్లాడినా ఇండియా తటస్థం కాదనీ, ఇండియాకు స్పష్టమైన వైఖరి ఉందని, శాంతియుతంగా జరిగే ఏ పరిష్కారానికైనా తమ సపోర్ట్ ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పామని మోదీ తెలిపారు.

మరోవైపు భారత్‌-రష్యా సంబంధాలు విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. హైదరాబాద్‌హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోదీ-పుతిన్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సైతం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మోదీకి పుతిన్‌ వివరించారు. ఈ సందర్భంగానే శాంతి మాత్రమే సమస్యకు పరిష్కారమని పుతిన్‌కు మోదీ స్పష్టంచేశారు. 

అయితే తాము ఉక్రెయిన్‌తో సంధి ఒప్పందం చేసుకోవాలని యత్నిస్తున్నామని, శాంతి పరిష్కార మార్గాలన్నిటినీ అన్వేషిస్తున్నామని పుతిన్​ చెప్పారు. బహుళ ధ్రువ ప్రపంచం కోసం పనిచేస్తామని వివరించారు. సాంకేతికత, కృత్రిమమేధ, అంతరిక్ష రంగాల్లో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పుతిన్‌ వెల్లడించారు.

కాగా, దీనికి ముందు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తన పర్యటనలో భాగంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుతిన్ నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, గొప్ప ఫిలాసఫర్‌గా, మానవతావాదిగా మహాత్మాగాంధీ నిలిచారని, ప్రపంచ శాంతికి ఎనలేని కృషి చేశారని పుతిన్ అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు. స్వేచ్ఛ, మంచితనం, మానవత్వంపై మహాత్మాగాంధీ ఆలోచన నేటికీ నిత్య నూతనమని గుర్తుచేసుకున్నారు.