18,822 మంది భారతీయుల్ని బహిష్కరించిన అమెరికా

18,822 మంది భారతీయుల్ని బహిష్కరించిన అమెరికా

వలసదారులపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వారిని సొంత దేశాలకు పంపుతున్నారు.  ఇప్పటికే వేలాది మందిని వారి స్వదేశాలకు పంపించిన ట్రంప్ సర్కార్‌ ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయుల్ని యూఎస్‌ బహిష్కరించినట్లు కేంద్రం వెల్లడించింది.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.  “2009 నుంచి ఇప్పటి వరకూ 18,822 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించింది” అని తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2023లో 617 మందిని, 2024లో 1,368 మందిని, 2025లో 3,258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించినట్లు వివరించారు. 2009 నుండి మొత్తం 18,882 మంది భారతీయులను వెనుకకు పంపిన్నట్లు ఆయన చెప్పారు.

“జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వీరిలో 2,032 మంది అంటే సుమారు 62.3 శాతం మందిని సాధారణ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపింది. మిగిలిన 1,226 మందిని (37.6 శాతం) యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించే చార్డర్‌ విమానాల్లో భారత్‌కు తరలించింది” అని జైశంకర్‌ వెల్లడించారు.

బహిష్కరించే సమయంలో బహిష్కరించే వారి పట్ల మానవీయంగా వ్యవహరించేలా చూసుకోవడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా వైపు నుండి నిరంతరం సహాయం కోరుతున్నట్లు జైశంకర్ తెలిపారు.  బహిష్కరణకు గురైన వారి పట్ల, ముఖ్యంగా మహిళలు, పిల్లలపై సంకెళ్ల వాడకం విషయంలో, మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను అమెరికా అధికారులతో గట్టిగా నమోదు చేసిందని మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో సభకు తెలిపారు. అయితే, ఫిబ్రవరి 5వ తేదీ బహిష్కరణ విమానం నుండి మహిళలు, పిల్లలను సంకెళ్లు వేసిన సందర్భం ఈ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు.