యాసిడ్ దాడి నిందితులపై కోర్టులు సానుభూతి చూపకూడదని, వారిపై మొత్తం వ్యవస్థ స్పందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గురువారం పేర్కొన్నారు. యాసిడ్ దాడి కేసులపై సుప్రీంకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ దేశ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల పెండింగ్ వివరాలను వెల్లడించాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఆ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పింది.
ఢిల్లీలో రోహిణి కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ యాసిడ్ దాడి కేసును సుప్రీం విచారిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా యాసిడ్ దాడి కేసులో విచారణ జరగడం సిగ్గుచేటు అని ధర్మాసనం చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయమాలా బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం ధర్మాసనం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
షాహీన్ మాలిక్ కేసులో సుప్రీం స్పందిస్తూ 2009 నుంచి ఆ కేసు రోహిణి కోర్టులో ఉందని, ఇది న్యాయ వ్యవస్థను పరిహాసం చేయడమే అవుతుందని ధర్మాసనం చెప్పింది. ఇది చాలా సిగ్గుచేటు అంశమని, దేశ రాజధానిలో ఓ కేసు ఇంత కాలం పెండింగ్‌లో ఉంటే, మరి ఎవరు దీన్ని పరిష్కరిస్తారని, ఇది నిజంగా దేశానికే సిగ్గుచేటు అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
ప్రభుత్వ పథకాలను పొందేందుకు యాసిడ్ బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలని మాలిక్ చేసిన అభ్యర్థనను కేంద్రం పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం చెప్పింది. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దివ్యాంగుల క్యాటగిరీలో యాసిడ్ దాడి బాధితుల్ని చేర్చేందుకు చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని సీజేఐ కోరారు. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని సిజెఐ కేంద్రాన్ని ఆదేశించారు.
16 ఏళ్ల క్రితం షాహీన్ మాలిక్ (26 ఏళ్ల వయస్సులో) ఆమె కార్యాలయం వెలుపల దాడికి గురయ్యారు. 25 శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఆమె యాసిడ్ దాడి బాధితులకు వైద్య, చట్టపరమైన మద్దతు అందించేందుకు 2021లో బ్రేవ్ సోల్స్‌ను స్థాపించారు. యాసిడ్ దాడి కేసులను రోజువారీ ప్రాతిపదికన నిర్వహించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సిజెఐ ప్రతిపాదించారు.
షాహీన్ మాలిక్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ 2009లో హర్యానాలో తనపై దాడి జరిగిందని, 2013 వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. నిందితుడికి శిక్ష పడింది కదా అని సిజెఐ ప్రశ్నించగా ఢిల్లీలోని రోహిణీలోని ట్రయల్ కోర్టులో తుది వాదనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును హర్యానా నుండి ఢిల్లీకి బదిలీ చేశారని, పోలీసులపై తనకు విశ్వాసం పోయిందని, తనపై దాడి చేసిన వారికి శిక్ష కంటే పరిహారం మాత్రమే కోరుకునే స్థాయికి తనను తాను తగ్గించుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఒక మహిళా న్యాయాదికారి ఈ కేసులో జోక్యం చేసుకుని విచారణను తిరిగి చేపట్టారని, ఆమె తనకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించారని ఆమె చెప్పారు. ఆమె కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ప్రతి రోజూ విచారణ చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక దరఖాస్తు దాఖలు చేయాలని సిజెఐ షాహీన్ మాలిక్‌కు సూచించారు.

More Stories
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
అమెరికాది ఒప్పు.. భారత్‌ది తప్పా?