కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం
కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు ” అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పద్దామని పేర్కొంటూ కూటమిలోని పార్టీల మధ్య ఉన్న ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 
“మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది” అని తెలిపారు.  
 
 గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది” అని తెలిపారు.
 
“నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు” అని సున్నితంగా కూటమి పార్టీల నేతలను హెచ్చరించారు.
 
మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారని, ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే అని పేర్కొంటూ దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో  మనం అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలని, అవినీతిని అరికట్టి బలహీనుల  గొంతుగా మారాలని పిలుపిచ్చారు.
 
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాంమని చెప్పారు. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదని, పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారని స్పష్టం చేశారు. 
 
జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం  సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం అని చెబుతూ ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుందని చెప్పారు. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.