తెలంగాణలోని జర్నలిస్టులకు సంబంధించి అక్రిడికేషన్ల జారి ప్రక్రియలో రెండేళ్లుగా జరుగుతున్న జాప్యాన్ని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దృష్టికి దృష్టికి తీసుకెళ్ళింది. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణా ప్రతాప్ (రజ్జు భయ్య), ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాధుని ప్రమోద్ కుమార్, కప్పర ప్రసాద్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 219 కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లలో ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్ మీడియాకు అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు డిజిటల్,వెబ్ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య బీమా అమలులో అంతులేని నిర్లక్ష్యం గ్రామీణ జర్నలిస్టులకు శాపంగా పరిణమించిందని యూనియన్ నేతలు గవర్నర్ ద్రుష్టికి తెచ్చారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యలు ఏళ్ళ తరబడి కొలిక్కి రాకపోవడం వల్ల జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచన చేయాలని కోరారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. అదే విధంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టులకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వెలువడుతున్న స్థానిక దినపత్రికల మనుగడ కోసం సమాచార శాఖ కార్యాలయంలో ఎన్ ప్యానల్ మెంట్ వేగవంతం చేయాలని, అర్హత గల పత్రికల ఎన్ ప్యానల్ మెంట్ పూర్తి చేస్తూ, పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి రేట్ కార్డు పెంచాలని కోరారు.

More Stories
అట్టహాసంగా ప్రారంభమైన మేడారం జాతర
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు `సుప్రీం’ కోర్టుధిక్కార నోటీసులు
మున్సిపల్ ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకే