ఉక్రెయిన్‌లో యుద్ధానికి స్వస్తి పలికేందుకు ఉద్దేశించిన శాంతి ఒప్పందంపై రష్యా, అమెరికాలు ఎలాంటి అంగీకారానికి రాలేదని క్రెమ్లిన్ బుధవారం తెలియజేసింది. అమెరికా శాంతి ప్రణాళికను రష్యా తిరస్కరించలేదని, కానీ అంగీకారానికి వచ్చే దిశగా జరగాల్సింది ఇంకా చాలా వుందని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూతల మధ్య ఐదు గంటల పాటు చర్చలు జరిగిన అనంతరం క్రెమ్లిన్ ఈ ప్రకటన చేసింది.
మాస్కోలో పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జేర్డ్ కుష్నర్లు మంగళవారం జరిపిన చర్చలు అర్ధరాత్రి దాటేవరకు కొనసాగాయి. పుతిన్ విదేశాంగ విధాన సహాయకుడు యూరి యుష్కొవ్, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం యుష్కొవ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎలాంటి అంగీకారం, రాజీ కుదరలేదని చెప్పారు. ఇంకా జరగాల్సింది, చేయాల్సిన కసరత్తు చాలా వుందని ఆయన విలేకర్లతో వ్యాఖ్యానించారు.
అమెరికా చేసిన కొన్ని ప్రతిపాదనలపై పుతిన్ ప్రతికూలంగా స్పందించారని యుష్కొవ్ తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ చాలా కీలకమైన సంకేతాలు పంపారని చెప్పారు. చర్చల వివరాలను మీడియాకు వెల్లడించరాదని నిర్ణయించినట్లు తెలిపారు. డాన్బాస్ ప్రాంతంపై ఇరు దేశాల మధ్య వివాదం గురించి వివరంగా మాట్లాడకుండా ‘భూభాగ సమస్య’పై వారు చర్చించారని క్లుప్తంగా చెప్పారు. అమెరికా చేసిన కొన్ని ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని, వాటిపై ఇంకా సవివరంగా చర్చలు జరపాల్సిన అవసరముందని చెప్పారు.
”వారు ప్రతిపాదించిన కొన్ని సమీకరణాలు మాకు అస్సలు సరిగా లేవు, వాటిపై ఇంకా కసరత్తు కొనసాగాల్సిన అవసరముంది.” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి కూడా విలేకర్లతో మాట్లాడారు. అమెరికా ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించారనడం పొరపాటని వ్యాఖ్యానించారు. శాంతి ప్రణాళికపై తొలిసారిగా జరిగిన పరస్పర అభిప్రాయాల మార్పిడే ఈ సమావేశమని ఆయన పేర్కొన్నారు. సాధారణ చర్చల ప్రక్రియ సాగిందని చెప్పారు. రాజీ కోసం అన్వేషణ సాగిందన్నారు.
క్రెమ్లిన్ నుండి సరాసరి మాస్కోలోని అమెరికా ఎంబసీకి వెళ్లిన విట్కాఫ్ చర్చల వివరాలను వైట్‌హౌస్‌కు తెలియజేశారని యుష్కొవ్ చెప్పారు. ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై క్రెమ్లిన్ అభ్యంతరాలు ప్రస్తుతం ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సమావేశమేదీ జరపాలనుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుత చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి అపార అవకాశాలు వున్నాయని చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత భయంకరమైనదిగా పరిగణిస్తున్న ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలకడం తమ విదేశాంగ విధాన లక్ష్యమని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇదేమీ అంత సులభమైనది కాదని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు.

More Stories
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
రూ.500తో మహిళలకు 40 నిమిషాల ఆన్లైన్ ఉగ్రవాద శిక్షణ
శ్రీలంకకు కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపిన పాక్