సంచార్‌ సాథీ యాప్‌ కు భారీ స్పందన

సంచార్‌ సాథీ యాప్‌ కు భారీ స్పందన

సైబర్‌ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం రూపొందించిన సంచార్ సాథీ యాప్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ముందస్తుగా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్‌ కంపెనీలను ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్‌ చేసుకుంటుండడం విశేషం.  టెలికమ్యూనికేషన్స్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం ఒకేరోజు దాదాపు 6లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

సాధారణ రోజుల్లో దాదాపు 60వేల మంది వరకు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసేవారు. అంటే ఒకే రోజు పదిరెట్ల డౌన్‌లోడ్స్‌ పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు 15 మిలియన్ల మంది ఇప్పటికే సంచార్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. గడిచిన ఒక్కరోజులో ఆరు లక్షల మంది యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని, ఇది దాదాపు పదింతల పెరుగుదల అని కేంద్రం తెలిపింది.

సంచార్‌ సాథీకి ఆదరణ పెరిగిన నేపథ్యంలో ముందస్తు ఇన్‌స్టలేషన్‌ను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించిందని టెలికామ్‌ విభాగం తన ప్రకటనలో పేర్కొన్నది.నవంబర్ 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని మొబైల్ కంపెనీలను ఫోన్లలో యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశించింది. భారత్‌లోని అన్ని ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని  పాత డివైజెస్‌లో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశించింది.

ఆయా కంపెనీలు ఫోన్‌లను తొలిసారి ఆన్ చేసిన సమయంలో యాప్ వినియోగదారులకు కనిపించేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కొని వర్గాలు తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్‌ తీసుకువస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛకు భంగమని పేర్కొంది.

యాప్‌ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మొబైల్‌ ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ ప్రీఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.  అయితే, సంచార్ సాథి యాప్‌ను మొదట 2023లో పోర్టల్‌గా ప్రారంభించారు. స్కామ్ కాల్‌ గురించి తెలిపేందుకు యూజర్ల తమ పేరుపై రిజిస్టర్‌ అయిన సిమ్‌కార్డులను గుర్తించేందుకు, దొంగతనాలు జరిగినప్పుడు ఫోన్లను డీయాక్టివేట్‌ చేసేందుకు దీన్ని తీసుకువచ్చారు. ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్) డీఎన్‌డీ యాప్‌ తరహాలో ఉంటుంది.

సంచార్‌ సాథీ యాప్‌పై కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టతనిచ్చారు. సంచార్‌ సాథీ యాప్‌ యాక్టివేట్‌ చేసుకోవడం కేవలం ఐచ్ఛికం మాత్రమేనని, ఇది తప్పనిసరి కాదని ఆయన ప్రకటించారు. అంతేగాక ఈ యాప్‌ని ఎవరైనా తొలగించుకోవచ్చని కూడా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన ఈ సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ ఎటువంటి నిఘా పెట్టడం కాని కాల్‌ మానిటరింగ్‌ కాని చేయబోదని స్పష్టం చేశారు. 

అంతేకాదు సంచార్ సాథీ సేఫ్టీ యాప్‌తో స్నూపింగ్ జ‌ర‌గ‌దని కూడా స్పష్టం చేశారు. సైబ‌ర్‌సెక్యూర్టీ యాప్‌ను కొత్త డివైస్‌ల‌ను ప్రీలోడ్ చేయాల‌ని స్మార్ట్‌ఫోన్ కంపెనీల‌కు కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను మంత్రి కొట్టిపారవేసారు. ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోస‌మే ఆ యాప్‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.