సిబ్బంది కొరతతో 200 ఇండిగో విమానాలు రద్దు

సిబ్బంది కొరతతో 200 ఇండిగో విమానాలు రద్దు
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు  తీవ్ర అంతరాయం  ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యం కాగా, ఇంకొన్ని రద్దవ్వడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నాటికి ఇండిగో విమాన సర్వీసులు కేవలం 35 శాతానికి పడిపోయాయి. బుధవారం ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా పలు విమానాశ్రయాల్లో దాదాపు 200 విమానాలు రద్దయ్యాయి. 
 
కొత్త నిబంధనలతో సిబ్బంది కొరత ఏర్పడి ఈ గందరగోళానికి దారితీసింది. గత నెలలో ప్రవేశపెట్టిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్ డి టి ఎల్) నిబంధనల ప్రకారం పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి సమయం ఇవ్వాలి. దీనికి అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను మార్చుకోవడంలో ఇండిగో ఇబ్బంది పడుతోంది. ఇటీవల సోలార్ రేడియేషన్ తో ప్రపంచ వ్యాప్తంగా 6 వేల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
 
సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్ని విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఎనిమిది గంటలపైగా ఆలస్యమయ్యాయి. దేశీయ విమానయాన మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో షెడ్యూల్‌లో అంతరాయం ఏర్పడటంతో మొత్తం వ్యవస్థపై ప్రభావం పడింది. దీనిపై ఇండిగో స్పందిస్తూ “గత రెండు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు తీవ్ర అంతరాయానికి గురైంది నిజమే. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం” అని తెలిపారు. 
 
“ఊహించని ఆపరేషనల్ సవాళ్లు, చిన్న సాంకేతిక సమస్యలు, శీతాకాలం కారణంగా షెడ్యూల్ మార్పులు, వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, అప్‌డేట్ చేసిన ఫ్లైట్ డ్యూటీ నిబంధనలు వంటి అనేక అంశాలు మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. వీటిని ముందుగానే ఊహించడం సాధ్యం కాలేదు’’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఎఫ్టీడీఎల్ నిబంధనల ప్రకారం ఉద్యోగి రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, ఏడాదికి 1,000 గంటలు మాత్రమే విమానయానం చేయాల్సి ఉంటుంది. ప్రతి సిబ్బందికి వారి ఫ్లైట్ సమయానికి రెట్టింపు విశ్రాంతి, ఏదైనా 24 గంటల వ్యవధిలో కనీసం 10 గంటల విశ్రాంతి తప్పనిసరి.  పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించి, అలసట వల్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా డీజీసీఏ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది.
 
వీలైనంత త్వరగా సాధారణ స్థితీకి తీసుకొచ్చి, సర్వీసులను పునరుద్దరించడానికి తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇండిగో ప్రకటించింది. అంతేకాదు, రద్దయిన విమానాల్లో టిక్కెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్ చెల్లిస్తున్నామని, విమానాశ్రయానికి వెళ్లే ముందు దయచేసి తాజా విమాన స్థితిని చూసుకోవాలని కోరింది.