తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానికి ఆహ్వానం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానికి ఆహ్వానం
ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి సిఎం రేవంత్‌రెడ్డి అరగంట పాటు ప్రధానికి వివరించారు.  పార్లమెంట్ భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి బుధవారం దాదాపు అరగంటపాటు జరిపిన భేటీలో  హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని సిఎం రేవంత్ కోరారు. 
 
మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందచేసిందని తెలిపారు. దీనికి రూ.43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధానికి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని  రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం అందించారు. రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అశ్వినీవైష్ణవ్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తోనూ భేటీ అయ్యారు.