శ్రీలంకకు కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపిన పాక్ 

శ్రీలంకకు కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపిన పాక్ 

దిత్వా తుఫాన్‌తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్‌ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది. ఆ  దేశానికి మానవతా సహాయంగా పాకిస్థాన్‌ మందులు, ఆహారపదార్ధాలు, అత్యవసర సామగ్రిని పంపింది.  అయితే ఎక్స్‌పైరీ అయిన మందులు, పాచిపోయిన ఆహార పదార్ధాలు, నాసిరకం సామగ్రి అందులో ఉండటం పట్ల శ్రీలంక దౌత్య వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

కొలంబోకు పంపించే ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను పాక్‌ హైకమిషన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఆ చిత్రాలను పరిశీలించగా ప్యాకెజీలపై 10 వ తేదీ 2024తో వాటి గడువు ముగిసినట్టు లేబుల్‌ కనిపించింది.  వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గడువు తీరిన పదార్థాలను సహాయార్థం ఇచ్చినందుకు సోషల్‌ మీడియాలో పాక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ చర్యల ద్వారా శ్రీలంకను పాక్‌ అవమానపరిచిందని నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక అధికారులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ పాకిస్థాన్‌ స్పందించలేదు. పాకిస్తాన్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, 2021లో, తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయాన్ని పంపినప్పుడు, సహాయ సామగ్రి దెబ్బతిన్న, కలుషితమైన స్థితిలోకి వచ్చిందని కాబూల్ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ రవాణా సామాగ్రిని నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తాయి. 

మరోవంక, దిత్వా తుపాను ప్రభావంతో కష్టాల్లో ఉన్న శ్రీలంకకు పంపే మానవతాసాయం విమానాలపై పాకిస్థాన్​ చేస్తున్న విమర్శలను భారత్​ తిప్పికొట్టింది. సహాయక పదార్థాలతో శ్రీలంకకు వెళ్తున్న విమానానికి భారత్​ అనుమతి ఇవ్వలేదంటూ పాకిస్థాన్ ఆరోపణలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఖండించారు. పాకిస్థాన్​ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపారు. 
 
పాకిస్తాన్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఆయన, పాకిస్థాన్​ చేసిన విజ్ఞప్తిని కేవలం కొన్ని గంటల్లోనే పరిష్కరించమని తెలిపారు. 2025 డిసెంబర్​ 1 మధ్యాహ్నం ఒంటిగంటకు విజ్ఞప్తి చేయగా, మానవతా సాయం దృష్ట్యా అదే రోజు సాయంత్రం 5. 30 గంటలకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో శ్రీలంకకు మద్దతుగా నిలవడంలో భారత్​ ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి తెలిపారు. కాగా, శ్రీలంకకు పంపే విమానాలకు ఎయిర్ క్లియరెన్స్ ఇవ్వకుండా 60 గంటల పాటు ఆపేసిందని పాకిస్థాన్​ విదేశాంగ శాఖ ఆరోపించింది.