జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖానుమ్ వెల్లడించారు. కానీ, ఇమ్రాన్ ఖాన్‌ను మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కుటుంబసభ్యులు కలిసేందుకు ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖానుమ్ కలిశారు.
ఇమ్రాన్‌ను కలిసేందుకు అడియాలా జైలుకు ఆయన ముగ్గురు సోదరిమణులు చేరుకోగా, ఒకరికి మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు పాటు ములాఖత్ అయిన తర్వాత బయటకొచ్చి మాట్లాడిన ఉజ్మా, ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. రోజంతా సెల్లోనే బంధిస్తున్నారని, తక్కువ సమయం మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆరోపించారు.
మిగతా ఖైదీలు ఎవరితోనూ మాట్లానివ్వకుండా చేస్తున్నట్లు ఇమ్రాన్ తనతో చెప్పినట్లు ఉజ్మా వెల్లడించారు. తన దుస్థితికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఆరోపించినట్లు ఉజ్మా చెప్పారు. మరోవైపు ఇమ్రాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబసభ్యులను అనుమతించకపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
మంగళవారం మాజీ ప్రధానికి అనుకూలంగా ఇస్లామాబాద్ హైకోర్టు, అడియాలా జైలు బయట నిరసనకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు ప్రభుత్వం రావల్పిండిలో సెక్షన్ 144 విధించింది. ప్రజా భద్రత దృష్ట్యా బుధవారం వరకు అన్ని ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్రూపులు రావల్పిండిలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ (డిఐసి) వివరించింది.
ఈ పరిణామాల వేళ ఇమ్రాన్‌ఖాన్ కుమారులు ఖాసీం, సులేమాన్ తమ తండ్రి విషయంలో ఏదో జరగకూడనిది జరిగినట్లు అనుమానం వ్యక్తంచేశారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమ తండ్రిని చూసేందుకు అనుమతించట్లేదని మండిపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం అందట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలన్నర రోజుల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్’లో ఒంటరిగా నిర్బంధించినట్లు వస్తున్న వార్తలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు 2023 నుంచి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు ఇటీవల విస్త్రృతంగా ప్రచారం జరిగింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని బలూచిస్థాన్ రెబల్స్‌కు చెందిన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చింది. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇందుకు సంబంధించిన వార్తలను ప్రచురించినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు.

More Stories
శ్రీలంకకు కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపిన పాక్
విషమంగా ఖలేదా జియా ఆరోగ్యం.. ప్రధాని మోదీ ఆందోళన
శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ భరోసా