శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ భరోసా

శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ భరోసా

ఇటీవల సంభవించిన దిత్వా తుఫాన్ కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసిన శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే సహాయక బృందాలను పంపిన భారత్ పొరుగు దేశానికి మరింత సాయం చేసేందుకు సిద్దమైంది. సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకేతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.  ‘ఆపరేషన్ సాగర్ బంధు’ కింద శ్రీలంకకు మరింత సాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

తుఫాన్ ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు భారత ప్రధాని. పొరుగు దేశమైన శ్రీలంకను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ దేశంలో దిత్వా తుఫాన్ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు.  ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తోంది. సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకేతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఆ దేశంలోని తుఫాన్ బాధితులకు పునరావాసం, ప్రజలకు నిత్యవసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఈ సందర్భంగా దిస్సనాయకేకు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కష్ట సమయంలో భారతీయులు లంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద సాయం చేస్తామని చెప్పిన మోదీకిలంక నాయకుడు దిస్సనాయకే కృతజ్ఞతలు తెలిపారు. బీభత్సం సృష్టించిన దిత్వా తుఫాన్ ఇప్పటివరకు శ్రీలంకలో 366మందిని బలిగొన్నది. వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది. 367 మంది గల్లంతయ్యారు.

ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా భారతదేశం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంలోని 80 మంది సభ్యుల బృందాన్ని శ్రీలంకకు పంపింది. కొలంబోలో చిక్కుకున్న 237 మంది భారతీయులను ఐఎఎఫ్ విమానంలో తిరువనంతపురానికి తరలించింది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు సహా పర్యాటకులను నేవీ హెలికాప్టర్లలో రక్షించి సురక్షితంగా తరలించారు.

వరద గుప్పిట చిక్కుకున్న శ్రీలంక ప్రజలను కాపాడేందుకు భారత వాయుసేన వెంటనే రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడిన కొటమలే ప్రాంతం నుంచి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతేకాదు ఇప్పటికే 21 టన్నుల సామగ్రిని లంకకు పంపింది భారత్. సుమారు 1.5 లక్షల మందిని తరలించారు.  బ్రిటన్, న్యూజిలాండ్ సహాయం అందించడానికి ముందుకు వచ్చాయి.  దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి ప్రపంచ బ్యాంకు సహాయం కోరనున్నట్లు అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ప్రకటించారు. 108 రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని రోడ్డు అభివృద్ధి అథారిటీ తెలిపింది.