జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ ఆమోద ముద్ర

జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ ఆమోద ముద్ర

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిని భారీగా పెంచే దిశగా  రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ ఆమోదం తెలపడంతో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేసే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా మొదలైంది. ఈ ఆమోదంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

విలీనానికి సంబంధించిన శాఖల నివేదికలు, భౌగోళిక సరిహద్దులు, మౌలిక సదుపాయాల సమన్వయం వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు పూర్తయ్యాయి. నగర అభివృద్ధికి ఇది కీలక నిర్ణయమని అధికారులు భావిస్తున్నారు.  విలీనంతో  ప్రస్తుతం ఉన్న నగర సరిహద్దులకు అదనంగా 27 స్థానిక సంస్థలు చేరడంతో మొత్తం విస్తీర్ణం 2,735 చదరపు కి.మీకి పెరగనుంది. 

ఈ విస్తరణతో హైదరాబాద్( భారత దేశంలోనే విస్తీర్ణపరంగా అతి పెద్ద మెట్రోగా అవతరించబోతోంది. మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, నీటి వనరుల పంపిణీ, శానిటేషన్ వంటి కీలక అంశాల్లో  జిహెచ్ఎంసి మరింత పెద్ద బాధ్యతను చేపట్టాల్సి ఉంటుంది. విలీన ప్రాంతాల్లో రాబోయే కాలంలో రోడ్లు, కాలువలు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు, చెత్త సేకరణ వంటి సేవలను జిహెచ్ఎంసి ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించే ప్రయత్నాలు ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండనున్నాయి. 

అలాగే రింగ్ రోడ్ పక్కన ఉన్న పలు పట్టణాలు కూడా నగర అభివృద్ధి ప్రణాళికల్లో భాగమవుతాయి. ఈ విలీనం ద్వారా మరింత సమగ్ర నగర ప్రణాళిక అమలు చేయటం సులభమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తు పట్న నిర్మాణంలో హైదరాబాద్ జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం పొందనుంది. మహానగర పరిధిలోకి చేరుతున్న ప్రాంతాలకు మెరుగైన పబ్లిక్ సర్వీసులు, శుద్ధి నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి సౌకర్యాలు అందే అవకాశం ఉంది.

జీహెచ్​ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తరువాత వాటికి సంబంధించిన ఆఫీస్​ల ద్వారానే పరిపాలన కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని, ప్రస్తుతం ఉన్న 6 జోనల్​ ఆఫీస్​లకు అనుసంధానిస్తారని పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, నూతనంగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు, 6 జోనల్​ కార్యాలయాల కిందే పని చేస్తాయి. 2 నెలల తరువాత జోన్ల సంఖ్యను పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు.