పార్లమెంటులో ఆడాల్సింది డ్రామా కాదు, జరగాల్సింది డెలివరీ

పార్లమెంటులో ఆడాల్సింది డ్రామా కాదు, జరగాల్సింది డెలివరీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరహాలో ఈ సెషన్ వృధా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నాటకాలు ఆడే అవకాశం సదా ఉంటుందని, ఎవరికైనా డ్రామాలు వేయాలని ఉంటే వేయొచ్చని మోదీ వ్యాఖ్యానించారు. కానీ పార్లమెంటులో ఆడాల్సింది డ్రామా కాదని, ఇది డెలివరీ జరగాల్సిన చోటు అని పేర్కొన్నారు.
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు దేశ ప్రజలను ఉద్దేశించి ఈమేరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ  బీహార్ ఎన్నికల్లో ఓడిపోయామనే బాధలో కొన్ని పార్టీలు ఇప్పటికే చాలా విమర్శలు చేశాయని, పార్లమెంటు సెషన్‌లో వాళ్ల నినాదాలకు కాకుండా విధాన రూపకల్పనకే ప్రాధాన్యత ఉంటుందని మోదీ తేల్చి చెప్పారు.  భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి పార్లమెంటు శీతాకాల సమావేశాలను విజయవంతం చేయాలని విపక్ష పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. దేశానికి ఉపయోగపడే బలమైన విధానాలు, చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు.
 
దేశ ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనకర చర్చకు తావు ఇచ్చేలా వ్యవహరించాలని నేను విపక్ష పార్టీలను కోరుతున్నాను. రాజకీయాల్లో నెగెటివిటీ పనిచేసే అవకాశాలు ఉంటాయి. కానీ అంతిమంగా దేశ నిర్మాణం కోసం పాజిటివ్ థింకింగ్ అవసరం. నెగెటివిటీని పక్కన పెట్టి, దేశ నిర్మాణంపై శ్రద్ధ పెట్టాలి. సరైన, సముచితమైన, సందర్బోచిత అంశాలనే పార్లమెంటు సెషన్‌లో విపక్షాలు ప్రస్తావించాలి.” అని ప్రధాని హితవు చెప్పారు. 

“బిహార్ ఎన్నికల్లో ఓటమితో అలుముకున్న ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టే యుద్ధ భూమిగానో, గెలుపుతో ఏర్పడిన అహంభావాన్ని ప్రదర్శించే వేదికగానో పార్లమెంటును మార్చొద్దు. బిహార్ ఎన్నికలు జరిగి చాలా రోజులైనా, కొన్ని పార్టీలు ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి బయటికి వచ్చినట్టు కనిపించడం లేదు” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

“భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికార, విపక్షాలు కీలక పాత్ర పోషించాలి. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు అందరూ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి, నిర్మాణాత్మక చర్చ జరపాలి. వికసిత భారత్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కొత్త ఎత్తులను చూస్తోంది. వికసిత భారత్ సాకారానికి విపక్షాలు చేయూత ఇవ్వాలి. జాతీయ స్థాయి అంశాలు, చట్టసభల ప్రధాన వ్యవహారాలు, ఆర్థిక విధానాల రూపకల్పనపై జరిగే చర్చల్లో భాగం కావాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.