హైదరాబాద్‌లోని అత్యంత విలువైన 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్)ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బిజెపి నాయకుల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సోమవారం వినతిపత్రం సమర్పించింది.
ఈ పాలసీ ప్రకారం, ఆర్ఆర్ఆర్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లోని 9,292 ఎకరాల భూమి మల్టీ-పర్పస్ యూజ్‌కి మార్చబడుతుందని, దాంతో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న జీవో ప్రక్రియ, మార్కెట్ విలువకు తక్కువగా 30–50 శాతం ఎస్ఆర్ రేట్లే విధించడం ద్వారా, భూములు ప్రైవేట్ రియల్టర్స్ నెట్‌వర్క్‌కు తక్కువ ధరలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లోని దాదాపు 9,000 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తీవ్ర అవినీతికి దారితీస్తుందని విమర్శించారు. ఎస్ఆర్ఓ రేట్లలో 30% మాత్రమే చెల్లించి భూములను కన్వర్ట్ చేసుకునే విధానం వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయేలా చేస్తోందని మండిపడ్డారు.
ఈ పాలసీ వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు, రైతులకు తీవ్ర నష్టం జరిగే తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు ప్రకటించారు.
ఈ బృందంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, జీహెచ్ఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Stories
ముఖ్యమంత్రి రేవంత్ కు ఎన్నికల్ కోడ్ వర్తించదా?
బిజెపి నేత సవాల్ కు ముఖం చాటేసిన మంత్రి ఉత్తమ్
`మానస’లో ప్రత్యేక పిల్లలతో ఒరాకిల్ ఉద్యోగుల బృందం