నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కదులుతూ ఉంది. తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తుపాను కదులుతుంది. కాసేపట్లో తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. కరైకాల్‌కు 120, పుదుచ్చేరికి 90, చెన్నైకు 150 కి.మీ. దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటలుగా 5 కిలోమీటర్ల వేగంతో దిత్వా తుపాను కదిలింది.
తుపాను నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. దిత్వా తుపాను కారణంగా అన్నమయ్య, కడప జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. చెరువులు, వాగులు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో వర్షాలతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోతామని ధాన్యం రైతులు భయాందోళన చెందుతున్నారు. దిత్వా తుపానుపై సచివాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు అధికారులు మరింత అలర్ట్‌గా ఉండాలని హోం మంత్రి సూచించారు.
క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని దిశానిర్దేశం చేశారు. ఈదురు గాలుల ధాటికి విరిగిన కొమ్మలు, హోర్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలని తెలిపారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు మంత్రికి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు.

More Stories
ఏపీ వ్యాప్తంగా 5 వేల ప్రాంతాల్లో సామూహిక మన్ కీ బాత్ వీక్షణ
అమరావతిలో రెండో దశలో 16,666.57 ఎకరాలభూసేకరణ
అమరావతిలో 25 బ్యాంకులకు శంకుస్థాపన