గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకే కుటుంబంపై దృష్టి సారించి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులను పట్టించుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉన్న ఈ రోజుల్లో అన్ని మతాలు, కులాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు.
గుజరాత్‌లోని వడోదరలో జరిగిన సర్దార్ @150 యూనిటీ మార్చ్‌లో పాల్గొంటూ కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపైనా వెంకయ్య నాయుడు మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘భారత్ ది డెడ్ ఎకానమీ’ అని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించిన విధానాన్ని గుర్తు చేశారు. అయితే భారత ఎకానమీపై యూఎస్ అధినేత వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇండియాది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నట్లు వెల్లడించారు.
“భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. అదే సమయంలో దేశంలో ఐక్యత ఉండాలి. అదే సర్దార్ పటేల్ చూపిన మార్గం” అని తెలిపారు. “దేశం ముందు, పార్టీ తర్వాత అని పటేల్ నమ్మారు. ఏక్తా యాత్ర నుంచి ప్రేరణ పొంది కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా మనమందరం ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. భారతదేశమంతా ఒకటే. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి” అని అభిలాష వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ పాలనలో సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల గురించి ఎప్పుడూ చర్చ జరగలేదు. ఐక్యతా విగ్రహం జాతీయ గర్వం. ఇది ఒక అద్భుతమైన ఘనత. ఈ విగ్రహ ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాంగ్రెస్ కాలంలో వారు ఒక కుటుంబం గురించి విస్తృతంగా దృష్టిసారించారు. చాలా సంస్థలకు ఆ కుటుంబ సభ్యుల పేరు పెట్టారు” అని విమర్శించారు.
ప్రపంచంలోనే ఎత్తైన ఐక్యతా విగ్రహం ఉన్న కెవాడియా ఒక చారిత్రక ప్రదేశంగా మారిందని వెంకయ్య నాయుడు తెలిపారు. “భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు వడోదరలో జరిగే సర్దార్ @ 150 యూనిటీ మార్చ్‌లో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది” అని చెప్పారు. “దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత, సార్వభౌమాధికారం, స్వావలంబనకు ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ సరైన నివాళి. కరంసద్ నుంచి కెవాడియా వరకు జరిగే ఈ చారిత్రక మార్చ్ ముఖ్యంగా దేశ యువతలో జాతీయవాదం మేల్కొలుపునకు గుర్తుగా నిలుస్తుంది” అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 26న ఆయన పూర్వీకుల గ్రామం కరంసద్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర డిసెంబర్ 5న నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ముగుస్తుంది. అయితే నవంబరు 30న వడోదరలో జరిగిన సర్దార్ @150 యూనిటీ మార్చ్‌లో వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, అన్నపూర్ణ దేవీ కూడా పాల్గొన్నారు.
“జాతీయ ఐక్యత, స్వావలంబన పొందిన భారత్ కోసం ఈ పాదయాత్ర సందేశాన్ని దేశంలోని ప్రతి మూలకు వ్యాపింపజేస్తున్నాం. ఈ యాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్వీకుల గ్రామమైన కరంసద్లో నవంబరు 26న ప్రారంభమైంది. ఈరోజు మేము వడోదరకు చేరుకున్న మార్చ్‌లో పాల్గొన్నాం” మాండవీయ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
“ఈ ప్రయాణం కేవలం ఒక పాదయాత్ర మాత్రమే కాదు. జీవిత, ఆలోచనల ప్రయాణం. ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇది ఐక్యత, స్వావలంబన భారత్‌ను నిర్మించే సందేశాన్ని అందిస్తుంది. ఈ యాత్ర దేశ ఐక్యతను బలోపేతం చేస్తుంది. స్వావలంబన భారతదేశాన్ని నిర్మిస్తుంది. దేశాన్ని అభివృద్ధిపథం వైపునకు తీసుకెళ్తుంది” అని తెలిపారు.

More Stories
ఇళ్లల్లో మాతృభాష, సంస్కృతం వాడకం తగ్గడం ఆందోళనకరం
నా జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు.. కుమారుని పేరు శేఖర్
శ్రీ భూమి కథ- నా అనుభవం