దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్‌అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ డిసెంబర్ 4తో పూర్తికావాల్సి ఉండగా డిసెంబర్ 11 వరకు ఈసీ పొడిగించింది. అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితా, తుది ఓటరు జాబితా విడుదల తేదీలను సవరించింది.
ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే నెల 16న తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 9న ముసాయిదా ఓటరు జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటరు బాబితా విడుదల కావాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, బంగాల్‌లో రెండో విడత ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది.
కాగా పలు రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి ఎన్నికల సిబ్బంది పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయం ఇచ్చి డెడ్‌లైన్ లోపు ‘సర్’ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈసీపై మండిపడ్డాయి. ‘సర్’ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిశారు. సర్ ప్రక్రియను రీ షెడ్యూల్ చేయాలని ఈసీని కోరారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను ‘సర్’ అంశం కుదిపేయనున్నది. ఈ నేపథ్యంలో ‘సర్’ గడువును మరో వారం ఈసీ పొడిగించింది.

More Stories
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా