ఎంతో అద్భుతంగా విలసిల్లిన సింధూ నాగరికత కాలక్రమేణ కనుమరుగు కావడం అనేది దేశంలోని అతిపెద్ద మిస్టరీల్లో ఒకటని చెప్పవచ్చు. ఈ మిస్టరీని చేధించేందుకు వేల ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు జరుగుతున్నాయి. కానీ మిస్టరీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఐఐటీ గాంధీనగర్ కు చెందిన పరిశోధకులు ఆ మిస్టరీని చేధించామని చెబుతున్నారు. సింధూ నాగరికత కనుమరుగు కావడానికి కరువుకాటకాలే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.
వరుస కరువులతో జనం బలవంతంగా సింధూ లోయను వదిలి హరప్పా, మొహెంజోదారో, రాఖిగర్హి, లోథాల్ పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. క్రమం తప్పకుండా జరిగిన ఈ వలసలతో చివరికి సింధూ లోయ నాగరికత కనుమరుగైపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు వాళ్లు ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. సింధూ లోయ నాగరికతనే సింధూ- సరస్వతి నాగరికత అని కూడా అంటారు. ఈ నాగరికత క్రీస్తుపూర్వ 5000 ఏళ్ల నుంచి 3500 ఏళ్ల మధ్య విలసిల్లింది.
ప్రస్తుతం నైరుతి భారతదేశం, పాకిస్థాన్ దేశాలు ఉన్న ప్రాంతమే ఈ సింధూ నాగరికత ప్రాంతం. ఈ భూ ప్రపంచంలో పట్టణాలు ఉన్న తొలి నాగరికతగా ఇది గుర్తింపు పొందింది. సింధూ నాగరికత కాలం నాటి నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ, లోహకళ అబ్బురపరుస్తాయి. ఐదువేల ఏళ్ల క్రితం వారు లోహాలపై డ్యాన్సింగ్ గర్ల్ లాంటి అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
సింధూ నాగరికత కాలం నాటి నీటి నిర్వహణ వ్యవస్థలు, వ్యాపార వ్యవస్థలు అద్భుతం. అంతటి ఘనమైన సింధూ నాగరికత కనుమరుగు కావడం అనేది పురాతత్వ శాస్త్రవేత్తలకు, చరిత్రకారులకు ఒక ఫజిల్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన విమల్ మిశ్రా నేతృత్వంలో జరిగిన పరిశోధన వరుస కరువుకాటకాలే సింధూ నాగరికత కనుమరుగుకు కారణమని తేల్చింది.
సింధూ నాగరికత కాలంలో నాలుగు తీవ్రమైన కరువులు ఆ నాగరికతను దెబ్బతీశాయని పరిశోధకులు తెలిపారు. ఆ నాలుగింటిలో ప్రతి కరువు 85 ఏళ్లకు పైగా కొనసాగడం గమనార్హం. వాటిలో ఒక కరువు అత్యంత సుదీర్ఘకాలం కొనసాగింది. దాదాపు 164 ఏళ్లపాటు కొనసాగిన ఆ కరువు దెబ్బకు సింధూ లోయ నాగరికత 91 శాతం తుడిచిపెట్టుకుపోయింది.

More Stories
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా