అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రూ.1,334 కోట్లతో ఈ కార్యాలయాల నిర్మాణాలు జరగనున్నాయి.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ, ఎల్ఐసీ, న్యూ ఇండియా అసురెన్స్ లిమిటెడ్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని చెబుతూ భూ త్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలని ఆమె సూచించారు.
బ్యాంకు రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయటం కాదని, రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆమె సూచించారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఎన్నో సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా బ్యాంకర్లు కృషి చేయాలని ఆమె చెప్పారు. భారతదేశం గర్వపడేలా రాజధాని రూపుదిద్దుకుంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ అత్యాధునిక సాంకేతికత వచ్చినా దానిని అందిపుచ్చుకునే హబ్‌గా అమరావతి తయారవుతుందని వెల్లడించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయని సీఎం వెల్లడించారు. 2028కి అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత ఎవరైనా స్థిరపడాలనుకుంటే వారికి సరైన గమ్యస్థానంగా అమరావతి ఉంటుందని చెప్పారు. వచ్చే 5 ఏళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవటంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని సీఎం స్పష్టం చేశారు.
సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుని దేశానికి ఆర్ధిక తోడ్పాటు ఇచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలాసీతారామన్‌ను సీఎం కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని అడిగారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని చెబుతూ అందుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో రెండేళ్లు పొడిగించాలని నిర్మలాసీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Stories
డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ లో పుతిన్ పర్యటన
కేరళ కాంగ్రెస్ ఎమ్యెల్యేపై లైంగిక వేధింపుల కేసు
బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ పై పట్టుకోసం బిజెపి