అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం 

అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం 
అస్సాం శాసనసభ గురువారం రోజు చారిత్రాత్మకమైన “అస్సాం బహు భార్యత్వ నిషేధ బిల్లు 2025″ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో బహుభార్యత్వ వివాహాలను నిషేధించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు అవకాశం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాంతాలకు, షెడ్యూల్‌ గిరిజనులకు ఈ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చారు. అంటే వారి సాంప్రదాయ కస్టమ్స్, ఆచారాలకు భంగం కలగకుండా చూశారు.
 
బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ముఖ్యంగా ఇస్లాంకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. “ఇస్లాం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మీరు నిజమైన ముస్లింగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. నిజమైన ఇస్లామిక్ ప్రజలు ఈ చట్టాన్ని స్వాగతిస్తారు. టర్కీ వంటి దేశాలు కూడా బహుభార్యత్వాన్ని నిషేధించాయి. పాకిస్థాన్‌లో కూడా ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఉంది” అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
ఎవరైనా ఓ వ్యక్తి భార్య లేదా భర్త బతికి ఉండగా, విడాకులు పొందకుండా రెండో వివాహం చేసుకుంటే  వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ముఖ్యంగా మొదటి వివాహం చెల్లుబాటులో ఉన్నప్పుడు లేదా విడాకుల ద్వారా రద్దు కానప్పుడు మరొకరిని వివాహం చేసుకోవడాన్ని ఈ చట్టం బహుభార్యత్వంగా నిర్వచించింది.

“ప్రతిపాదిత చట్టాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా వివాహాన్ని జరిపించే ఏ వ్యక్తికైనా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు” అని బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. పదేపదే అదే నేరం చేస్తే తదుపరి ప్రతి నేరానికి నిర్దేశించిన శిక్షకు రెట్టింపు శిక్ష విధించాలని కూడా ఇది ప్రతిపాదించింది.
 
గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై చర్చ అనంతరం కాంగ్రెస్, సీపీఐ(ఎం) సహా విపక్ష ఎమ్మెల్యేలు చర్చను బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లును సీఎం శర్మ శీతాకాల సమావేశాల మొదటి రోజున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నిక అయితే మొదటి సెషన్‌లోనే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిజి)ను అమలు చేస్తానని ప్రకటించారు.