ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఓఎస్డీని విచారించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఓఎస్డీని విచారించిన సిట్

తెలంగాణాలో రాజకీయంగా కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో అతడిని రెండు గంటల పాటు పలు అంశాలపై ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ గా  బాధ్యతలను చేపట్టిన సీవీ సజ్జనార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేసు విచారణ ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్లు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. కేసు దర్యాప్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించినట్లుగా తెలుస్తోంది. అతడి స్టేటుమెంట్ సిట్ అధికారులు రికార్డు చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితులు, నిందితులను ఇప్పటికే పలువిడతలుగా సిట్‌ విచారించింది. నలుగురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్‌ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో ‘భారత రాష్ట్రసమితి సుప్రీం’ అనే పదాన్ని వాడారు. అంటే, కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్‌రావు చెప్పినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఉంది. 

ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు ఓఎస్‌డీగా పని చేసిన రాజశేఖర్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఓ వైపు వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాంగ్మూలాలను ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే రికార్డ్ చేస్తుంది. ఇంకా కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

కొద్ది రోజుల క్రితం సిట్ బృందానికి కొన్ని కీలక ఆధారాలు చిక్కడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఇందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు(టీఎస్పీలు) కొంత ఆలస్యంగా పంపించిన లేఖలే ఈ దర్యాప్తును ముందుకు నడిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసిన ఫోన్లకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ – టీఎస్పీలైన జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఎస్ఐబీ ఆఫీస్కు పంపించాయి.

అప్పటికే ప్రభాకర్రావు బృందం ఎస్ఐబీ నుంచి వెళ్లిపోవడంతో ఆ లెటర్స్ వారి చేతికి చిక్కలేదు. లేకపోతే ఆ ఆధారాలను సైతం మాయం చేసే వారని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు.