హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 55 మంది మృతి

హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 55 మంది మృతి
హాంకాంగ్‌లో థాయ్‌పో జిల్లాలోని ఏడు 35 అంతస్తుల నివాస భవనాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు భవనాలకు మంటలు అంటుకొని 55 మంది మరణించారు. మరో 279 మందికిపైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. చైనా నగరం షెన్‌జెన్‌కు సరిహద్దుగా ఉన్న హాంకాంగ్ శివారు ప్రాంతమైన థాయ్ పోలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 
 
మధ్యాహ్న సమయంలో ఒక భవనంలో మంటలు చెలరేగాయి. సాయంత్రం వరకు ఏడు భవనాలకు అంటుకున్నాయి. ఓ భవనం సమీపంలో ఉన్న టవర్లను సైతం చుట్టుముట్టాయి. ఈ ప్రమాదం తర్వాత 900 మంది ప్రజలను ఖాళీ చేయించారు. వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఈ కేసులో నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఓ కన్సల్టెంట్‌ను అరెస్టు చేసినట్లు గురువారం తెల్లవారు జామున అధికారులు ప్రకటించారు. 
 
అపార్ట్‌మెంట్‌ కిటికీలపై మండే గుణమున్న పాలీస్టైరిన్‌ బోర్డులను ఏర్పాటు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాన్‌ లీ మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని థెయ్ల్పారు. ఫైర్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాత్రి సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లుగా కనిపించినా, పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని పేర్కొన్నారు. 
 
అగ్నిమాపక శాఖకు పెద్ద ఎత్తున అత్యవసర కాల్స్ వచ్చాయని చెప్పారు. 140కి పైగా అగ్నిమాపక వాహనాలు, 60 అంబులెన్స్‌లు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను సంఘటనా స్థలంలో మోహరించినట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖకు చెందిన 37 సంవత్సరాల ఉద్యోగి మరణించారని.. విపరీతమైన వేడిలో ఉండడంతో అలసట కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే, అగ్నిమాపకశాఖ నెంబర్‌ 4 హెచ్చరికలు జారీ చేసింది. 
 
మంటలు వేగంగా భవనం వెలుపలి భాగంలో ఏర్పాటు చేసిన వెదురు కర్రలకు వ్యాపించాయి. దాంతో భారీగా అగ్నికీలకలు ఎగిసిపడగా దట్టంగా పొగ వ్యాపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వాంగ్‌ ఫుక్‌ కోర్టు కాంప్లెక్స్‌గా పిలిచే ఈ ఎస్టేట్‌లో మొత్తం 1984 ప్లాట్లు ఉండగా దాదాపు 4వేల మంది ఇందులో నివసిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో నివసించే వారి కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసిన హాంకాంగ్‌ ప్రభుత్వం నిర్వాసితులను అక్కడికి తరలిస్తోంది.