పెద్దాడ నవీన్,
సీనియర్ జర్నలిస్ట్
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకుంటున్నారు.
ఆ రహస్య ఒప్పందం ఏంటి?
ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెబుతున్న ఒక ఒప్పందం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే ‘2.5 ఏళ్ల ఫార్ములా’. దీని ప్రకారం మొదటి రెండున్నర ఏళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తోంది.
డీకే శివకుమార్ ఏమంటున్నారు?
ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. “అప్పుడు ఐదు, ఆరుగురు పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయటపెట్టను. కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ‘రహస్య ఒప్పందం’ అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు.
కాగా, తనతో మాట్లాడేందుకు గడిచిన వారం రోజులుగా ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ నుంచి జవాబు వచ్చింది. ప్లీజ్ వెయిట్.. నేను మీకు కాల్ చేస్తా అంటూ రాహుల్ గాంధీ నుంచి డీకేకు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చని ఊహాగానాలు సాగుతున్న వేళ డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సిద్ధరామయ్య ధీమా
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెబుతున్నారు. అధిష్టానం ఏం చెబితే అది చేస్తానని పైకి అంటున్నా, లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి, వెనుకబడిన వర్గాల (అహిందా) మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తోంది.
అధికార పంపకం ఒప్పందం ఏదీ లేదని బహిరంగంగా ఖండించడంతోపాటు పూర్తిగా ఐదేళ్ల పదవీకాలం తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అధికార పంపకం ఒప్పందాన్ని బహిరంగంగా తిరస్కరించాల్సిన అవసరం లేదని, త్వరలోనే వారిద్దరితో తాను మాట్లాడుతానని ప్రియాంక్ ఖర్గేకు రాహుల్ చెప్పినట్లు తెలిసింది.
స్తంభించిన పాలన
నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి పడకేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. పాలన పట్టించుకునే నాథుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేతిలో నిర్ణయం
విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్దరామయ్యను కొనసాగిస్తారా? లేక శివకుమార్‌కు అవకాశం ఇస్తారా? అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

More Stories
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను చంపేశారని పుకార్లు
భారతీయులకు 90 శాతం దాకా హెచ్1బీ వీసాలు నకిలీవే
ముంబై మారణహోమానికి 17 ఏళ్ళు.. నాటి స్పందన సిగ్గుచేటు!