వీఐటీ భోపాల్‌ క్యాంపస్‌లో హింసాత్మక నిరసనలు

వీఐటీ భోపాల్‌ క్యాంపస్‌లో హింసాత్మక నిరసనలు

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తాగునీటి కొరత, నాసిరకం ఆహారం, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల జాండిస్‌ వ్యాధికి గురవుతున్నామని, కొందరు మరణించారని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేస్తున్నట్లు వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు. విట్‌ కేంపస్‌లో మంగళవారం రాత్రి 3వేల మందికి పైగా విద్యార్ధులు ఆందోళనలకు దిగారని పోలీసులు తెలిపారు. కలుషితమైన ఆహారం, నీరు తాగడంతో అనేకమంది విద్యార్ధులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్ధులు అంబులెన్సుకు, బస్సుకు, మూడు కార్లకు నిప్పంటించారు. 

హాస్టళ్ళను, ఛాన్సలర్‌ నివాసాన్ని, కేంపస్‌లోని ఇతర ప్రాంతాలను కూడా ధ్వంసం చేశారు.  లేబరేటరీలు, సైన్స్‌ పరికరాలు, లిఫ్ట్‌లను, సిసిటివి కెమెరాలను, మెస్‌ను, ఆహారం స్టోరేజీ రూమ్‌లను కూడా విద్యార్ధులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో సమీప ప్రాంతాల్లోని స్టేషన్ల నుండి పోలీసులు కేంపస్‌కు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అష్టా సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి అకాష్‌ అమల్కర్‌ తెలిపారు.

ఒక విద్యార్ధి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వార్డెన్‌ ప్రశాంత్‌ కుమార్‌ పాండే, మరో ఐదుగురు సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. కొంతమంది విద్యార్ధులను వారు కొడుతున్న వీడియో ఒకటి తమ చేతికందిందని అమల్కర్‌ తెలిపారు. చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.  హింసాత్మక నిరసనల నేపథ్యంలో డిసెంబరు 8 వరకు శలవులను యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. దీంతో విద్యార్ధులు ఇంటి బాట పట్టారు. 
అయితే తరగతులు మాత్రమే రద్దు చేశామని, విద్యార్ధులు కేంపస్‌ను ఖాళీ చేయనక్కరలేదని విట్‌ రిజిస్ట్రార్‌ కె.కె.నాయర్‌ తెలిపారు. గత నెల రోజుల్లో 33మంది విద్యార్ధులు జాండీస్‌ బారిన పడ్డారని ఆయన చెప్పారు.  తాము నెల రోజుల పైబడి ఆహారం, నీరు గురించి ఫిర్యాదు చేస్తున్నా యూనివర్శిఠీ యంత్రాంగం పట్టించుకోలేదని, అందుకే తాము నిరసనలకు దిగాల్సి వచ్చిందని కొంతమంది విద్యార్ధులు తెలిపారు. 
అలాగే అనారోగ్యం బారిన పడిన విద్యార్ధుల సంఖ్య గురించి కూడా వారు తప్పు చెబుతున్నారని, 200 మందికి పైగా విద్యార్ధులు ఇటీవలి వారాల్లో జాండీస్‌ బారిన పడ్డారని సీనియర్‌ విద్యార్ధి ఒకరు తెలిపారు. పైగా ఫిర్యాదు చేసిన విద్యార్ధులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని చెప్పారు.