అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్‌ అవాకులు

అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్‌ అవాకులు
అయోధ్య ధ్వజారోహణ క్రతువుపై పాక్‌ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇతరులకు పాఠాలు చెప్పే నైతికత దాయాదికి లేదని చురకలు వేసింది. వారి దేశంలో దారుణంగా ఉన్న మానవ హక్కుల రికార్డ్‌పై దృష్టి సారించాలని హితవు పలికింది. హిందువులకు ఎంతో ముఖ్యమైన భావోద్వేగ, ఆధ్యాత్మిక క్షణాల వేళ పాకిస్థాన్‌ అవాకులు చెవాకులు పేలింది. 
 
ఎలాంటి ఆధారాలు లేకుండా ముస్లింల పట్ల భారత్‌ వివక్ష చూపుతోందని, ముస్లిం సంస్కృతిని, వారసత్వాన్ని నిర్మూలిస్తోందంటూ ఆరోపించింది. పాక్‌ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్పందించారు. దాయాది వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల అనుచితంగా ప్రవర్తించే చరిత్ర కలిగిన పాకిస్థాన్‌కు ఇతరులకు నీతివాఖ్యాలు చెప్పే నైతికత లేదని జైశ్వాల్‌ తెలిపారు.

అయోధ్యలో రామాలయం పూర్తికి సంకేతంగా ధ్వజారోహణ క్రతువు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. అయోధ్యలోని భవ్య రామమందిర నిర్మాణం పూర్తి కావటంతో శతాబ్దాలనాటి గాయాలు, బాధలు నయమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సూచికగా కాషాయధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని, దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాం

మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలని అక్కడి ప్రభుత్వ విజ్ఞప్తిపైనా రణధీర్ జైశ్వాల్ స్పందించారు. బంగ్లా ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. “బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత న్యాయ ప్రక్రియను నడుస్తున్నందున ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలతో పాటు శాంతి, ప్రజాస్వామ్యం కోసం కట్టుబడి ఉన్నాం.” అని రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.

మరోవైపు హసీనా అప్పగింతపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంపై వారంలో స్పందిస్తారని తాను అనుకోవట్లేదని, కానీ తాము భారత్ నుంచి సమాధానం ఆశిస్తున్నామని అక్కడి విదేశాంగ శాఖ సలహాదారు తౌదీశ్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఆమె దోషిగా తేలినందున తిరిగి అప్పగించాలని పేర్కొన్నారు.