భారతీయులకు 90 శాతం దాకా హెచ్1బీ వీసాలు నకిలీవే 

భారతీయులకు 90 శాతం దాకా హెచ్1బీ వీసాలు నకిలీవే 

భారతీయులకు జారీ చేసిన 80 నుంచి 90 శాతం హెచ్1బీ వీసాలు నకిలీవని భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ ఆరోపించారు. నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో వీసాలను పొందారని పేర్కొన్నారు. హెచ్1బీ వీసాకు కావాల్సిన నైపుణ్యాలు వారికి లేవని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా కేవలం చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా హెచ్1బీ వీసాలు పొందడంపై అనుమానం వ్యక్తం చేశారు.

అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విభాగాల్లో నేటికి ప్రతిభావంతుల కొరత ఉందని, భారత్ నుంచి వచ్చేవారు దాన్ని భర్తీ చేయడానికి అవసరం ఉందని మహవష్ సిద్ధిఖీ అంగీకరించారు. అయితే ఇందుకోసం భారతీయులకు జారీ చేసిన వీసాల్లో మోసం జరిగిందని ఆరోపించారు. 2005 నుంచి 2007 వరకు చెన్నై కాన్సులేట్లో ఆమె అమెరికా దౌత్యవేత్తగా పనిచేశారు. 

ఆ సమయంలో తాము ఆ మోసాన్ని గుర్తించి, విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని తెలిపారు. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై ఎలాంటి దర్యాప్తు జరపకుండా తమను అడ్డుకున్నారని చెప్పారు. 

భారతీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు ఈ మోసాలు జరిగాయని సిద్ధఖీ వ్యాఖ్యానించారు. చెన్నై కాన్సులేట్లో తాను ఉన్నప్పుడు 51వేలకుపైగా వలసేతర వీసాలు జారీచేశామని, వాటిలో ఎక్కువగా హెచ్1బీ వీసాలే ఉన్నాయని సిద్ధఖీ పేర్కొన్నారు. ఈ కాన్సులేట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, హైదరాబాద్ రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తులను పరిశీలించినట్లు చెప్పారు. 

అందులో హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తుల పైన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భారత్లో మోసం, లంచం, సాధారణమైనవని, ఒక భారతీయ- అమెరికన్గా ఇలా చెప్పేందుకు తనకు కష్టంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉద్యోగ ఇంటర్వ్యూలు చేసే వ్యక్తి అమెరికన్  అయితే, అభ్యర్థులు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యేవారు కాదని సిద్ధఖీ తెలిపారు. అదే భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే, అభ్యర్థుల నుంచి లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తారని ఆమె ఆరోపించారు.

ఇదిలా ఉండగా హెచ్1బీ వీసా మోసాలపై అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా హెచ్1బీ వీసాలు పొందడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వీసా కేటాయింపులు విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు దాటిపోయిందని ఆరోపించారు. ఓ పాడ్కాస్ట్లో ఆయన ఈ మేర వ్యాఖ్యానించారు. 

హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వచ్చేవారు 71శాతం మంది ఉండగా, చైనా నుంచి మాత్రం కేవలం 12 శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. భారత్కు కేవలం 85 వేల వరకే హెచ్1బీ వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉందని, మరి అలాంటప్పుడు భారత్లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 హెచ్1బీ వీసాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువ అని గుర్తు చేశారు. ఇందతా చూస్తుంటే అక్కడ ఏదో మోసం జరుగుతుందని స్పష్టమవుతుందని చెప్పారు.