దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు ఓ లేఖ వ్రాస్తూ ఓటు హక్కును వినియోగించడం వల్ల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు.
18 ఏళ్లు నిండి తొలిసారి ఓటరుగా మారిన వ్యక్తులను రాజ్యాంగ దినోత్సవం రోజున గౌరవించాలని చెబుతూ కర్తవ్యాలను నిర్వర్తించడం వల్లే హక్కులు వస్తాయని మహాత్మా గాంధీ విశ్వాసాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సామాజిక, ఆర్థిక ప్రగతికి విధుల నిర్వహణ కీలకమని, నేటి తరం తీసుకునే విధానాలు, నిర్ణయాలు రాబోయే తరం జీవితాలను మార్చేస్తుందని చెప్పారు.
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా వెళ్తున్న దేశాన్ని మదిలో పెట్టుకుని పౌరులు తమ కర్తవ్యాలను అమలు చేయాలని ప్రధాని చెప్పారు. మానవ హుందాతనానికి, సమానత్వానికి, విముక్తికి మన రాజ్యాంగం ప్రాధాన్యత ఇస్తుందని, మనకు హక్కులను కల్పిస్తుందని, దీంతో పాటు పౌరులమన్న బాధ్యతలను కూడా కల్పిస్తుందని, దీన్ని మనం ఎప్పుడూ నిర్వర్తించాలని, ఆ విధులే మన బలమైన ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు అవుతాయని మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతలకు కూడా ఆయన ఈ సందర్భంగా నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాతల విజన్, ముందుచూపు ప్రేరణతోనే వికసిత్ భారత్ సాధించాలని కోరారు. దేశం మనకు చాలా ఇచ్చిందనే ఆలోచన వస్తే, ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా, స్వచ్ఛందంగా విధులను నిర్వర్తించేందుకు సిద్ధమైపోతారని మోదీ పేర్కొన్నారు.
మన ప్రతీ చర్య, ప్రతీ నిర్ణయం దేశ లక్ష్యాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, తద్వారా భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. “భారత రాజ్యాంగం వల్లే నేను దేశ ప్రధాని అయ్యాను. నేనొక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. ఆర్థికంగా మా కుటుంబం పరిస్థితి అంతంతే. అయినా నేను గత 24 ఏళ్లుగా దేశ ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను” అని గుర్తు చేసారు.
“నాకు బాగా గుర్తుంది, 2014లో తొలిసారి పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టేటప్పుడు వినమ్రంగా వంగి మెట్లకు మొక్కాను. ఎందుకంటే అది ప్రజాస్వామ్య దేవాలయం. 2019లో పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా నేను వినమ్రంగా వంగి నుదుటితో భారత రాజ్యాంగ గ్రంథాన్ని తాకి నమస్కారాలు సమర్పించాను. నాలాంటి ఎంతోమందికి ఎన్నో అవకాశాలను భారత రాజ్యాంగం ఇచ్చింది. నా లాంటి వాళ్లకు కలలు కనే శక్తిని, ఆ దిశగా పనిచేసేలా బలాన్ని రాజ్యాంగమే ప్రసాదించింది” అని ప్రధాని మోదీ తెలిపారు.

More Stories
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగం
శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం
ఎస్ఐఆర్ పై బిజెపి దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం